హన్మకొండ అర్బన్: ప్రభుత్వం త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ఈనేపథ్యంలో రేషన్ కార్డులో పేరున్నవారంతా ఈ నెలాఖరు నాటికి తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. సర్వర్, నెట్‌వర్క్ సమస్యల కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు రాష్ట్ర సేవల నుంచి కేంద్ర సేవలకు సాంకేతిక మార్పిడి (మైగ్రేషన్) చేపడుతున్న కారణంగా జూలై 21, 22, 23 తేదీల్లో ఈ–కేవైసీ, స్మార్ట్ పీడీఎస్ సేవలు అందుబాటులో ఉండవని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది.
ఆందోళనలో లబ్ధిదారులు
వచ్చే నెలలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌కు సంబంధించిన మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులు రేషన్ దుకాణాల బాట పడుతున్నారు. మూడు రోజులు కేవైసీ సేవలు అందుబాటులో ఉండవని తెలియక రేషన్ షాపులకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరోవైపు ప్రస్తుతం మూడు రోజులు సేవలు నిలిచిపోవడంతో మిగిలిన స్వల్ప గడువులో ఈ–కేవైసీ పూర్తి చేయడం కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే. ఆగస్టు 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభం కానుండడంతో రేషన్ డీలర్లపైనా అదనపు పనిభారం పడనుంది.
గడువు పొడిగించాలి..
మూడు రోజుల పాటు ఈ–కేవైసీ సేవలు నిలవడంతో గడువు ముగిసేలోపు ప్రక్రియ పూర్తి చేయడం కష్టమవనుంది. ఆగస్టు 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కార్డుదారులు, డీలర్ల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ–కేవైసీ గడువును పొడిగించాలి.
– మహేశ్వరం గౌరీ శంకర్, రేషన్ డీలర్ల సంఘం నాయకుడు
రేపటి వరకు కేవైసీ సేవల నిలిపివేత
లబ్ధిదారులకు తప్పని తిప్పలు
ఆగస్టులో మూడు నెలల బియ్యం పంపిణీ
గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేనా?


