హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి అర్జీని ఆలస్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లతో మాట్లాడిన కలెక్టర్, ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులపై వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రతి అర్జీ స్థితిని పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు. మొత్తం 268 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డీఆర్‌డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి, సీపీఓ సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ ప్రజావాణికి 192 ఫిర్యాదులు
న్యూశాయంపేట : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖ 51, మున్సిపల్‌శాఖ 6, హౌసింగ్ 65, డీఆర్‌డీఓ 18, ఇతర శాఖలకు సంబంధించి 52 దరఖాస్తులు (మొత్తం 192) రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఖిలా వరంగల్ మండల పరిధిలోని జిందా బిక్కన్ దర్వేష్ దర్గాకు సంబంధించిన భూమిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దర్గా కమిటీ బాధ్యులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ నాగలక్ష్మి, డీఎంహెచ్‌ఓ ప్రకాష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


