వరంగల్ అర్బన్ : ప్రజలు చెల్లించే పన్నులతోనే మనం జీతాలు తీసుకుంటున్నాం.. ప్రజా సమస్యలంటే ఎందుకు అలుసు?.. ప్రతి ఫిర్యాదుకు వారంలో పరిష్కారం లభించాలి.. లేదంటే ఆ సమస్యపై వివరణ ఇవ్వాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కమిషనర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ‘పరిష్కారమా..పరిహాసమా? అనే వార్త కథనం సాక్షి దినపత్రిక’లో ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన కమిషనర్ గ్రీవెన్స్ అనంతరం అధికారులకు, సిబ్బందిని మందలించారు. గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆశించిన పురోగతి లేదని ప్రతి వారం స్వీకరించిన ఫిర్యాదులు కచ్చితంగా పరిష్కారం కావాలన్నారు. ఆయా విభాగాల లాగిన్‌లలో ఫిర్యాదులు పేరుకుపోకుండా వెంటనే పరిష్కారం చూపాలన్నారు. ఇదిలా ఉండగా గ్రీవెన్ సెల్‌కు 118 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్‌ఈ రాజ్ కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ ఫిర్యాదుల్లో
జాప్యాన్ని సహించను
నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు
గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్న


