● భయాందోళనలో ప్రజలు
గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జూన్ చివరి వారంలో పక్కన ఉన్న ఖానాపురం మండలం రాగంపేటలో సీసీ కెమెరాలో కనిపించింది. ఆ తర్వాత 30 తేదీ సాయంత్రం గూడూరు మండలం మర్రిమిట్ట శివారు తోటదస్రుతండా సమీప మామిడితోటలో సంచరించింది. సాయంత్రం జాతీయ రహదారి దాటుతుండగా వాహనదారులు చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. జూలై 5న మండలంలోని దామరవంచ అటవీ ప్రాంత పోడు భూముల్లో కూడా సంచరించినట్లు తెలిసింది. తాజాగా శనివారం సాయంత్రం గూడూరు సమీప పాకాలవాగు పక్కన బూడిదినడుమ మార్గంలోని జీలుగు పంట చేలు వైపు ఓ రైతు వెళ్లాడు. ఆ సమయంలో పెద్ద శబ్దం చేస్తూ కొ ద్ది దూరంలో ఏదో జంతువు కదిలి నట్లు గమనించిన రైతు భయంతో ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం ఉదయం రైతులు వెళ్లి చూశారు. అక్కడక్కడ గుర్తు తెలియని అటవీ జంతువు పాదముద్రలుగా గుర్తించారు. ఇవి ఇటీవల సంచరిస్తున్న చిరుతపులి అడుగులు కావొచ్చనే అనుమానంతో వెంటనే రైతులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. జీలుగ పంటలో పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు అవి చిరుతపులి అడుగులేనని తేల్చారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్వో జి. ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ పాకాలవాగు సమీపంలోని పాదముద్రలు చిరుతపులివేనని, మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ చిరుతపై దాడి చేయొద్దని, ఎలాంటి హానీ తలపెట్టొద్దన్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంత సమీప గ్రామస్తులు ఒంటరిగా తిరగొద్దనిని, చిరుత కనిపించిన వెంటనే సమాచారం తమకు అందించాలని కోరారు.


