జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

గతంలోనూ

ఈతరహా విభేదాలే..

ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి

ఫిర్యాదు

ఇరువర్గాల మధ్య

కుదురుతోందనుకున్న

సయోధ్యకు బ్రేక్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లా హస్తం పార్టీలో తెరపైకి మరోసారి వర్గపోరు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

మ్మడి వరంగల్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ నేరుగా ఏఐసీసీ (ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ) నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతోందనే సంకేతాలు కనిపించినప్పటికీ, తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్‌ పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

సయోధ్య సంకేతాలు.. తాత్కాలికమే!

ఇటీవల ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం, పరస్పరం విమర్శలు తగ్గించడం, పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం వంటి పరిణామాలతో విభేదాలు ముగిశాయనే ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి ఇటీవల నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు కొండా దంపతులు హాజరు కూడా అయ్యారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో కూడా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, తాజా లేఖ వ్యవహారంతో ఆ సయోధ్య తాత్కాలికమేనని తేలిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు బయటపడడం పార్టీపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఇరువర్గాల మధ్య మరోసారి రాజీ ప్రయత్నాలు జరుగుతాయా? లేదా? అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

తాజా వివాదానికి కారణాలివే..

కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసమావేశంలో ఉమ్మడి వరంగల్‌ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని అధికారులకు సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవహారాల్లో ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రిని పక్కనబెట్టి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కడియం శ్రీహరి వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, ప్రభుత్వ పరి పాలనలో అనవసర జోక్యం చేసుకోవడం వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత నుంచే కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గాల పరిధి, పార్టీ వ్యవహారాలు, అధికారుల సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల విషయంలో ఇద్దరూ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ విభేదాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లడంతో పలుమార్లు సర్దుబాటు ప్రయత్నాలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement