ఊ అంటారా.. ఉఉ అంటారా! | - | Sakshi
Sakshi News home page

ఊ అంటారా.. ఉఉ అంటారా!

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

ఊ అంటారా.. ఉఉ అంటారా!

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: నామినేటెడ్‌ పదవులపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. గతేడాది జూలై 8న రాష్ట్ర ప్రభుత్వం నియమించిన చాలా మంది రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్ల పదవీకాలం మంగళవారం ముగిసింది. ఆయా కార్పొరేషన్లకు ప్రస్తుతం ఉన్నవారినే తిరిగి చైర్మన్లుగా మరోమారు కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకుల మధ్య తీవ్రంగా సాగుతోంది. ఈసమయంలో త్వరలోనే ఖాళీ అయిన నామినేటెడ్‌ పదవుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ సీనియర్లు, టికెట్‌ ఆశించి నిరాశ చెందిన నేతలు, ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులు, సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం రేవంత్‌, టీపీసీసీ చీఫ్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, మంత్రులు, ముఖ్య నేతలతో లాబీయింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం.

‘నామినేటెడ్‌’ పోస్టుల్లో ఎవరెవరు?

కాంగ్రెస్‌ ప్రభుత్వం దశల వారీగా నామినేటెడ్‌ పదవుల్లో పలువురు సీనియర్లకు అవకాశం కల్పించింది. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన అధిష్టానం నిర్ణయం మేరకు వాటిని త్యాగం చేసిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ఈక్రమంలో మొట్టమొదటగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. ఆ తర్వాత 2024 జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 37 మందిని నియమించిన ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి చాన్స్‌ ఇచ్చింది. పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ టికెట్లు ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్‌ సీడ్స్‌, గ్రోవర్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి వచ్చింది. పరకాల పోటీ నుంచి వైదొలగిన ఇనగాల వెంకట్రాంరెడ్డికి ‘కుడా’ చైర్మన్‌, మహబూబాబాద్‌ నుంచి బెల్లయ్యనాయక్‌కు ట్రైబల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్‌రెడ్డికి ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చింది. అలాగే, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎండీ రియాజ్‌కు గ్రంథాలయ పరిషత్‌ వంటి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అందరి పదవీ కాలం ముగియడంతో వారికి మరో చాన్స్‌ ఇచ్చి కొనసాగిస్తారా? మరికొందరు సీనియర్లకు సామాజిక ప్రాతిపదికన కొత్తగా అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. తిరిగి మరోసారి కొనసాగేందుకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లు కొందరు సీఎం, మంత్రుల స్థాయిలో మాట్లాడుతున్నట్లు సమాచారం.

ఎవరికి ప్లస్‌, ఎవరికి మైనస్‌?

పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్‌, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్‌ పదవుల కోసం పోటీలో ఉన్నారు. అయితే ఈసారి కూడా ఎవరికీ ప్లస్‌.. ఎవరికీ మైనస్‌ అవుతోందన్న ఆందోళన ఆశావహుల్లో ఉంది. ఇప్పటి వరకున్న చైర్మన్లతో పాటు చాలా మంది సీనియర్లు ఉమ్మడి వరంగల్‌ నుంచి సామాజికవర్గాల వారీగా పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిలో ఉన్న సీనియర్లు దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్‌, ఈవీ శ్రీనివాసరావు, డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, గాజర్ల అశోక్‌, పింగిళి వెంకట రాంనర్సింహారెడ్డి పదవులు ఆశిస్తున్నారు. బండి సుధాకర్‌గౌడ్‌, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, భరత్‌ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌, మార్క విజయ్‌కుమార్‌, అబూబక్కర్‌, పోలెపల్లి రంజిత్‌రావుతో పాటు పలువురు కార్పొరేషన్‌ చైర్మన్లతో పాటు ఇతర నామినేటెడ్‌ పోస్టుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈసారి అధిష్టానం ఎలాంటి ఫార్ములా అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వా రికి, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ప్రా ంతీయ సమతుల్యతను పాటిస్తూ పదవులు ఇస్తారా లేక ఇప్పటికే పదవుల్లో ఉన్న వారినే కొనసాగిస్తారా అన్నది సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

నామినేటెడ్‌ పదవులపై ఉత్కంఠ..

పదవీకాలం ముగిసిన నేతల్లో టెన్షన్‌

కొనసాగింపా, కొత్తవారికా..

సీఎం రేవంత్‌ నిర్ణయమే కీలకం

రాజధానికి మారిన ‘నామినేటెడ్‌’ సీన్‌.. ఆశావహుల లాబీయింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement