గ్రేటర్ కమిషనర్ వెంకన్న
వరంగల్ అర్బన్: క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వింగ్ అధికారి వరకు సమన్వయంతో నిబద్ధతతో, పారదర్శకంగా పనిచేస్తూ మహా నగరాభివృద్ధికి కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషన్ టి.వెంకన్న ఆదేశించారు. మంగళవారం నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయంలో వింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో భాగంగా ప్రజారోగ్యానికి మేలు కలిగేలా పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సేవల మెరుగుదలపై సూచనలిచ్చారు.
జంతు సంరక్షణ, డంపింగ్ యార్డు పరిశీలన
బాలసముద్రంలోని బయో కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, కోకోపిట్, జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం, పొడి వ్యర్థాల వేరు చేసే కేంద్రాలను కమిషనర్ పరిశీలించారు. అనంతరం హసన్‌పర్తిలోని జంతు జనాభా నియంత్రణ (ఏబీసీ) కేంద్రంలో నిర్వహణ తెలుసుకున్నారు. మడికొండలోని డంపింగ్ యార్డును పరిశీలించి బయోమైనింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ పట్టణ ప్రణాళిక అధికారి రవీందర్ రాడేకర్, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, అకౌంట్స్ అధికారి శివలింగం, ఉప కమిషనర్ ప్రసన్నరాణి, మున్సిపల్ ఆరోగ్య అధికారి రాజేశ్, ఉద్యానఅధికారి లక్ష్మారెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్లు, అధికారులున్నారు.


