అప్పులు.. వడ్డీల భారమే కారణం | - | Sakshi
Sakshi News home page

అప్పులు.. వడ్డీల భారమే కారణం

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

జనగామ: జనగామలోని పూర్ణిమ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బంధువులకు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, ప్రైవేట్‌గా తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక తీవ్ర మానసిక వేదనకు గురై రిటైర్డ్‌ టీచర్‌ పగిడిపల్లి మల్లయ్య (63) సోమవారం అర్ధరాత్రి తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు, కుటుంబ సభ్యులు, 33 పేజీల సూసైడ్‌ నోట్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి.

బంధువులు ద్రోహం చేశారు..

మృతుడు మల్లయ్య తన సూసైడ్‌ నోట్‌లో 1995 నుంచి 2021 వరకు బంధువులకు ఇచ్చిన అప్పులు, తాను ఇతరుల నుంచి తీసుకున్న అప్పులు, వాటిపై చెల్లించిన వడ్డీలు, రావాల్సిన, చెల్లించాల్సి న మొత్తం వంటి అన్ని ఆర్థిక లెక్కలను తేదీల వారీగా, వడ్డీలతో సహా సవివరంగా సూసైడ్‌ నోట్‌లో నమోదు చేశారు. ముఖ్యంగా బావమరుదులు, బంధువులు తనకు ద్రోహం చేశారని, అప్పు తీసుకునే సమయంలో మంచి మాటలు చెప్పి, తిరిగి ఇవ్వాల్సిన సమయంలో మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కూడా లేఖ రాశారు. 2024 ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేసిన తనకు రావాల్సిన మొత్తం రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.56, 33,435 కాగా, ఇప్పటి వరకు రూ.45,55,897 మాత్రమే అందాయని తెలిపారు. ఇంకా రూ.10,77,538 జెడ్పీ జీపీఎఫ్‌ బకాయి ఉందని చెప్పారు.

భార్య, పిల్లలకు..

భార్య అనిత, కుమారుడు భార్గవ్‌, కుమార్తె మౌక్తిక, అల్లుడు విక్రమ్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ‘నన్ను క్షమించండి.. పిల్లలను బాగా చూసుకోండి. చంటి పిల్లలను జాగ్రత్తగా పెంచండి. నాకు రూ.50 వేల పెన్షన్‌ వస్తుంది. అమ్మను జాగ్రత్తగా చూసుకో.. చెల్లి, కోడళ్లు, బావ అందరూ మిత్రుల్లా ఉండాలి.. కుటుంబ బాధ్యత మొత్తం నీదే’ అంటూ కుమారుడికి సూచించారు.

పలువురిపై ఆరోపణలు

తన చావుకు ప్రధాన కారణం గుంటి రత్నాకర్‌ అని, తనకు రూ.1.44 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. గుంటి మనోహర్‌ తనకు రూ.27.23 లక్షలు ఇవ్వాల్సి ఉందని, ఆయన భార్య, కుమార్తె కూడా ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. గుంటి రాధమ్మ సుమారు రూ.10 లక్షలు ఇవ్వలేదని, గుంటి జయశ్రీ అసత్య ప్రచారం చేసిందని రాశారు. రత్నాకర్‌ గారు మీ నుంచి భూమి విలువతో కలిపి రూ.3.44 కోట్లు రావాలి. మీకిచ్చిన డబ్బు అడిగితే నేను రాక్ష సుడినయ్యాను అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. నా బావమరుదులకు అప్పు ఇవ్వడం నేను చేసిన మొదటి తప్పు. వారిని నా వారిగా నమ్మి నా సర్వస్వాన్ని ధారపోశాను. 1995 నుంచి 2021 వరకు వారు ఆపదలో ఉన్నారని డబ్బులు ఇచ్చాను. ఏ రోజు కాగితం రాయించుకోలేదని పేర్కొన్నారు. రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడంతో తాను ఇతరులకు వడ్డీ రూపంలో సుమారు రూ.26 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. నా శవాన్ని పంచనామాకు తీసుకెళ్లే ముందు కలెక్టర్‌ లేదా పోలీసు ఉన్నతాధికారి.. మీడియా సమక్షంలో నేను రాసిన లేఖ మొత్తం చదివిన తర్వాతే నన్ను దించండి. నా చావుకు కారణమైన వారు అంత్యక్రియలకు రావొద్దని స్పష్టంగా రాశారు.

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కూతురు, అల్లుడు

ప్రజలకు చివరి విజ్ఞప్తి

నా కుటుంబాన్ని పక్కనపెట్టి బంధువులకు సాయం చేశాను. ఎన్నడూ వడ్డీ అడగలేదు. అసలు కూడా బలవంతంగా అడగ లేదు. వారు ఎంత ఇస్తే అంతే తీసుకున్నాను. కానీ, అనేక సందర్భాల్లో అవమానించారు. నాకు జరిగిన అన్యాయంపై ప్రతి పౌరుడు ఆలోచించాలని రాశారు. స్వాధీనం చేసుకున్న సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

వాట్సాప్‌ సందేశం ప్రస్తావన

2021ఏప్రిల్‌16న మనోహర్‌ పంపిన వాట్సాప్‌ సందేశాన్ని కూడా సూసైడ్‌ నోట్‌లో జత చేశారు. బావా నమస్తే.. నేను రూ.10 లక్షల వరకు ఇవ్వాలి అని నాకు అర్థమైంది. ఒకేసారి ఇవ్వలేను. అయినా తప్పకుండా ఇస్తాను అని ఆ సందేశంలో మనోహర్‌ పంపించిన సందేశాన్ని ప్రస్తావించారు.

రిటైర్డ్‌ ఉపాధ్యాయుడి బలవన్మరణంతో జనగామ పూర్ణిమ కాలనీలో

విషాదఛాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement