తప్పుడు వారసత్వ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

తప్పుడు వారసత్వ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్‌

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

పలువురిపై కేసు నమోదు

రామన్నపేట : తప్పుడు వివరాలతో ఇంటి ఆస్తిని గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఘటనపై మట్టెవాడ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌ కథనం ప్రకారం.. పోచమ్మమైదాన్‌కు చెందిన షేక్‌ మహబూబ్‌పాషా తండ్రి షేక్‌ అహ్మద్‌ పేరుపై ఉన్న ఇంటి ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే పెద్దన్న షేక్‌ మహమ్మద్‌ పాషా తానే ఏకై క చట్ట వారసుడినని తప్పుడు ప్రకటన చేశాడు. అలాగే జీవించి ఉన్న తమ తల్లిని మరణించినట్లు తప్పుడు సమాచారం ఇచ్చి సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ డ్యాకుమెంట్‌ రైటర్‌తో కుమ్మకై ్క ఇంటిని తన భార్యపేరు మీద గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఫిర్యాదు దారు మహబూబ్‌పాషా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో గిఫ్ట్‌ డీడ్‌ సాక్షులుగా సంతకాలు చేసిన మరో ఇద్దరు వ్యక్తులు కూడా కుట్రలో భాగమైనట్లు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌ తెలిపారు.

కౌన్సిలర్‌

సంపత్‌రాజ్‌పై కేసు

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లుకు చెందిన కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ సౌదరపెల్లి సంపత్‌రాజ్‌పై బీఎన్‌ఎస్‌ 74, బీఎన్‌ఎస్‌ 333 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు స్టేషన్‌ఘన్‌పూర్‌ సీఐ జి.వేణు తెలిపారు. ఈ విషయమై మంగళవారం సాయంత్రం సీఐ వివరాలు వెల్లడించారు. ఛాగల్లుకు చెందిన 9వ వార్డు కౌన్సిలర్‌ సంపత్‌రాజ్‌ ఆదివారం రాత్రి ఓ ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఇంటిపై అంతస్తులో మంచంపై నిద్రిస్తున్న వృద్ధురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. అయితే సదరు వృద్ధురాలు అతడిని నెట్టివేసి గట్టిగా అరిచింది. దీంతో ఆమె కోడలు ఇంటి ముందు, వెనుక తలుపులు మూసి భర్త, ఇరుగుపొరుగు వారికి చెప్పింది. వారు వచ్చేసరికి ఇంటి గోడ దూకి పక్క ఇంటిలో బాత్‌రూంలో దాక్కున్నాడు. కాగా, బాధితులు 100 డయల్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం, వృద్ధురాలిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో సంపత్‌రాజ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని సీఐ తెలిపారు.

21.69 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ఖిలా వరంగల్‌: అక్రమంగా నిల్వచేసిన రేషన్‌ బియ్యం, నూకలపై వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు మంగళవారం దాడులు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో పసునూరి రాజ్‌కుమార్‌, పెరుమండ్ల రవీందర్‌ ప్రజల నుంచి సేకరించిన పీడీఎస్‌ బియ్యాన్ని నిల్వచేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌కు పక్కా సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో కనకదుర్గ ట్రేడర్స్‌ పేరుతో వారు నిర్వహిస్తున్న గోదాంపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు చేశారు. ఇందులో రూ.58,090 విలువైన 21.69 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం, నూకలు, మిశ్రమ బియ్యం, తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం మిల్స్‌కాలనీ పోలీసులకు కేసును అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement