వరంగల్ అర్బన్: నగరంలోని గిర్మాజీపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు మట్టెవాడ అజయ్‌కుమార్ అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఆయన రూపొందించిన సూక్ష్మ కళాకృతులు అంతరిక్షంలో విహరించనున్నాయి. భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ స్కైరూట్ ఎయిర్‌స్పేస్ ‘మిషన్ ఆగమన్’ ప్రయోగించనున్న విక్రమ్–1 రాకెట్ ద్వారా ఆయన కళాఖండాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 12 నుంచి ఆగస్టు 4 మధ్యలో అంతరిక్షయానంలో ప్రయాణించనున్నాయి. ఈ విషయాన్ని స్కైరూట్ ఎయిర్‌స్పేస్ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది.
సూది రంధ్రంలో శాస్త్రవేత్తల కళారూపాలకు..
డాక్టర్ సీవీ రామన్, విక్రమ్ సారాబాయి, ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిరూపాలను అజయ్‌కుమార్ సూది రంధ్రంలో రూపొందించారు. ఈ శిల్పాలు సూది రంధ్రంలో 800 మైక్రాన్ల (0.8 మిల్లీమీటర్లు) ఎత్తుతో అత్యంత సూక్ష్మంగా రూపొందించారు. మానవ కంటితో వీటిని స్పష్టంగా చూడడం సాధ్యం కాదు. ప్రత్యేక మైక్రోస్కోప్ సాయంతో మాత్రమే వీటిని వీక్షించవచ్చు. ఈ ప్రాజెక్టును ఆయన 2023లో ప్రారంభించి 2026 ఫిబ్రవరి నెలలో పూర్తి చేశారు. ఈ సూక్ష్మ కళాఖండాలను రూపొందించడానికి సుమారు 140 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. అంతరిక్ష ప్రయాణానికి అనువుగా ఉండే స్టెయిన్‌లెస్‌స్టీల్, 24 క్యారెట్ల బంగారం, స్వచ్ఛమైన వెండి, సిరామిక్ పొడి, కార్బన్ ఫైబర్ చూర వంటి ప్రత్యేక పదార్థాలను ఉపయోగించి చెక్కినట్లు ఉద్ఘాటించారు.
24 క్యారెట్ల బంగారంతో..
అజయ్‌కుమార్ 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన సూక్ష్మ రాకెట్ నమూనాలో ప్రతిష్ఠించి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేశారు. కానీ, స్కైరూట్ ఎయిర్ స్పేస్ ఇంజనీర్లు సూచించిన సాంకేతిక ప్రమాణాలను అనుసరించి 24 క్యారెట్ల బంగారంతో రూపకల్పన చేశారు. ఈ కళాఖండాలపై కఠినమైన వైబ్రేషన్, హీటింగ్, ఇంజనీరింగ్ అర్హత పరీక్షలు విజయవంతమయ్యాయి. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన రక్షిత పేలోడ్ హౌసింగ్‌లో అమర్చి విక్రమ్–1 రాకెట్ పేలోడ్‌లో భాగంగా అంతరిక్ష యాత్రకు సిద్ధం చేశారు. ఇప్పటివరకు అంతరిక్షంలోకి పంపించిన కళాఖండాల్లో మూన్ మూజ్యిమ్(1969), ఫల్లెన్ అస్టోనాల్టు (1971 గుర్తింపు పొందాయి. తాజాగా భారతదేశం నుంచి సూది రంధ్రంలో రూపొందించిన ఈ సూక్ష్మ శిల్పాలు చెక్కి అజయ్ కుమార్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 40 ఏళ్ల సూక్ష్మ శిల్పకళకు ఇది దక్కిన అత్యున్నత గౌరవంగా భావిస్తున్నానని అజయ్‌కుమార్ తెలిపారు. ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన స్కైరూట్ ఎయిర్‌స్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్‌కుమార్ చందన, నాగభారత్ దాకా, నిఖిల్ మద్దూరి, సీవీఎస్ కిరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అంతరిక్షంలో విహరించనున్న
ఆయన కళాకృతులు
అధికారికంగా ధ్రువీకరించిన స్కైరూట్ ఎయిర్‌స్పేస్ సంస్థ


