● కారు ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం
● మద్యం మత్తులో వాహనం నడిపి ఇద్దరిని బలితీసుకున్న డ్రైవర్
● పాలకుర్తిలో ఒకరు, గూడూరులో మరొకరు మృతి
పాలకుర్తి టౌన్ : మద్యం మత్తు డ్రైవింగ్ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మద్యం సేవించిన ఓ డ్రైవర్ కారు నడుపుతూ అంత్యక్రియలకు వెళ్లొస్తున్న ఓ మహిళను, బంధువుల ఇంట్లో బారసాలకొచ్చి వెళ్తున్న మరో వ్యక్తిని ఢీకొన్నాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదాలు ఇరువురి కుటుంబాల్లో తీరని విషాదం నింపాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రఘనాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన పెంతల వెంకటలక్ష్మి (42) తన భర్త శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం పాలకుర్తి మండలం దర్దేపల్లి శివారు గూడోళ్లగూడెంలో బంధువు మృతి చెందగా అంత్యక్రియలకు హాజరైంది. కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి తిరిగి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన చేపూరి రాహుల్ మద్యం మత్తులో కారు నడుపుతూ పాలకుర్తిలో బైక్‌ను ఢీకొనడంతో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం రాహుల్ కారు ఆపకుండా అతివేగంతో వెళ్లి గూడూరులో చిల్పూరు మండలం క్రిష్టాజీగూడెం గ్రామానికి చెందిన వడ్లకొండ రంజిత్(30)ను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే దుర్మణం చెందాడు. రంజిత్ తన అత్తగారి గ్రామం గూడూరులో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రంజిత్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలిని సీఐ జానకీరాంరెడ్డి సందర్శించారు. కారు డ్రైవర్ రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.


