అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో ఆగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
కాశిబుగ్గ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలోని వెనుకభాగంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఒకటుందని ప్రజలకు తెలియడం లేదు. ఇక్కడ గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేవారు. ఆరేళ్లనుంచి ఆపరేషన్లు చేయడం లేదు. కోవిడ్‌కు ముందు ఎంజీఎం వెనుకభాగంలో ప్రత్యేకంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత అడ్రస్ మార్చారు. ప్రస్తుతం ఓల్డ్ చిల్డ్రన్స్ వార్డు లోపల డ్యూటీ డాక్టర్ రూంను కేటాయించారు. ప్రస్తుతం ఈ వార్డుకు బయట వయోవృద్ధుల చికిత్స వార్డు, జిల్లా క్యాన్సర్ చికిత్స వార్డు అని పేరు రాశారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్రానికి ప్రత్యేకంగా గుర్తింపు లేదు. బోర్డు అసలే లేదు. ముందు భాగాన ఉన్న ఓ గదిలో మాత్రం పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
ఆగిపోయిన ఆపరేషన్లు..
ఈ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విరివిగా చేసేవారు. వేసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్ల చేస్తూ కుటుంబ నియంత్రణలో విధులు నిర్వహించేవారు. కోవిడ్ తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. గతంలోలాగా ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించడం, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయడం బంద్ చేశారు. దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదని తెలుస్తోంది. దీంతో ఇక్కడ ఈ సదుపాయం ఉన్నట్లు ప్రజలకు తెలియట్లేదు.
కొనసాగుతున్న ఇమ్యునైజేషన్ ప్రక్రియ..
ఇందులో పనిచేస్తున్న సిబ్బంది ఇమ్యునైజేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రామన్నపేట, పాపయ్యపేట, పోతననగర్, మట్టెవాడ ప్రాంతాల్లో హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నాన్ కమ్యూనకేబుల్ డిసీజ్‌కు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అలాగే 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలకు సర్వేకల్ క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ విధుల్లో ఉంటున్నారు. ఆదివారం తప్ప ప్రతిరోజు ఈ ప్రక్రియ కొనసాగుతున్నా ప్రచారం కొరవడడంతో అందరికీ తెలియడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో గతంలో మాదిరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవి ధంగా ఈ సెంటర్ ప్రజలకు సులభంగా తెలిసేలా బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంజీఎంలో ఇలాంటి ఒక సెంటర్ ఉన్నట్లు తెలియని వైనం
ప్రస్తుతం ఇమ్యునైజేషన్ విధుల్లో సిబ్బంది


