బల్దియా కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: పన్ను వసూళ్ల లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేధించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో పన్ను వసూళ్ల పురోగతిపై సోమవారం ఆయన సమీక్షించారు. ఆశించిన స్థాయిలో పన్నులు వసూలు చేయకపోవడంపై, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్‌లు, ట్యాక్స్ ఆఫీసర్‌పై అసహనం వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లు, దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్ ప్రసునారాణి, పన్నుల అధికారి రామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రహరీ నిర్మాణానికి
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..
మడికొండలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గహం, కళాశాలకు ప్రహరీ లేక ఎదురవుతున్న ఇబ్బందులపై కమిషనర్ పర్యవేక్షించారు. వసతి గృహం, కళాశాల ఆవరణను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయన వెంట సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, పశువైద్య అధికారి డాక్టర్ గోపాల్‌రావు, ప్రిన్సిపాల్ జ్యోతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కోర్టు ఆదేశాలు అమలు చేయండి..
హనుమకొండలో నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణాల అనుమతులు, ఇంటి నంబర్లు జారీ చేశారని, వాటిని రద్దు చేయాలని కమిషనర్ టి.వెంకన్నను ఎన్.సమరసింహ ఫిర్యాదు చేశారు. బల్దియాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని, ఉత్తర్వులు అమలు చేయాలని విన్నవించారు.


