హన్మకొండ అర్బన్/కాజీపేట అర్బన్/న్యూశాయంపేట/ఖిలావరంగల్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి బాలసముద్రం పోలింగ్ కేంద్రాన్ని, కాజీపేట మండలం న్యూశాయంపేటలో శనివారం సర్ ప్రక్రియను, వరంగల్ తూర్పు నియోజవర్గంలోని ఖిలా వరంగల్ మండలంలో క్షేత్రస్థాయిలో ఆయన సర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్‌ఓలతో సమావేశమై సూచనలిచ్చారు. ఓటర్లు సమర్పించిన ఎన్యూమరేషన్ ఫారాలను యాప్‌లో నమోదు చేసే విధానాన్ని స్థానిక బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల జాబితాను వీడియో రూపంలో చిత్రీకరించడాన్ని అభినందించారు. కాగా, వరంగల్ జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టర్ సత్యశారద మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి సర్ అమలు తీరుపై కలెక్టరేట్‌లో సమీక్షించారు.


