ఈద్‌ కా తోఫా.. ఇఫ్తార్‌కి దావత్‌ | - | Sakshi
Sakshi News home page

ఈద్‌ కా తోఫా.. ఇఫ్తార్‌కి దావత్‌

Mar 17 2026 8:53 AM | Updated on Mar 17 2026 8:53 AM

ఇఫ్తార్‌ .. మతసామరస్యానికి ప్రతీక పేదల ముఖంలో చిరునవ్వు పారదర్శకంగా పంపిణీ

జిల్లాల వారీగా ఈద్‌కా తోఫాలు.. ఇఫ్తార్‌ దావత్‌లకు నిధులు

పండుగ వేళ సర్కారు రంజాన్‌ కానుకలు

పండుగకు ముందే పంపిణీ అభినందనీయం

న్యూశాయంపేట : పవిత్ర రంజాన్‌ మాసం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ముస్లింలు ఈద్‌–ఉల్‌–ఫితర్‌ను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈద్‌ కా తోఫా పేరుతో రంజాన్‌ కానుకల పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేసింది. దీంతోపాటు అధికారిక ఇఫ్తార్‌ విందులను నిర్వహిస్తోంది. ఈ పండుగ సంతోషం కేవలం ఉన్నత వర్గాలకు పరిమితం కాకూడదని, నిరుపేద ముస్లిం కుటుంబాల్లో కూడా వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈద్‌ కా తోఫాలు అందజేసి రంజాన్‌ నెలలో ఉపవాస దీక్షలు చేపట్టిన వారికి ఇఫ్తార్‌ దావత్‌లు ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఫలం, భోజనం మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యతను చాటే అద్భుత సందర్భం. మరో వైపు నూతన వస్త్రాలు అందజేసి నిరుపేద కుటుంబాల్లో పండుగ పూట వెలుగులు నింపుతోంది. మసీదులు, ఈద్గాలో కమ్యూనిటీ హాళ్లలో వేలాది మంది కలిసి ఇఫ్తార్‌ విందుల్లో పాల్గొనడం వరంగల్‌ లాంటి చారిత్రక జిల్లాలో సోదర భావా నికి నిలువుటద్దంగా నిలుస్తోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో తోఫాల పంపిణీ, ఇఫ్తార్‌ విందుల ఏర్పాటు పకడ్బందీగా జరుగుతున్నాయి. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా అర్హుడైన ప్రతీ నిరుపేద ప్రయోజనం పొందేలా అధికారులు పనిచేస్తున్నారు.

ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్‌ విందు (దావత్‌)లు కేవలం ముస్లింలకే కాకుండా అన్ని వర్గాల ప్రజల మధ్య సోదర భావం పెంపొందిస్తాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రతీ కాన్‌స్టెన్సీలో వెయ్యిమందికి పైగా ఉపవాస దీక్షా పరులు(రోజేదార్‌) విందులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన మసీదుల్లో ఏర్పాట్లు చేసి పేదలకు ఇఫ్తార్‌ సమయానికి అవసరమైన ఖర్జూరాలు, పండ్లు, మంచినీరు, పంపిణీ చేసేందుకు నిధులు విడుదల చేశారు.

ప్రతీ పేద ముస్లిం కుటుంబం పండుగను ఆత్మగౌరవంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈద్‌కా తోఫా పేరుతో రంజాన్‌ కానుకలు అందజేస్తున్నారు. ఈ కిట్‌లో జత పురుషుల వస్త్రాలు (కుర్తా, పైజమా), మహిళలకు నాణ్యమైన చీర లేదా సల్వార్‌ కమీజ్‌లు ఉన్నాయి. తెల్ల రేషన్‌ కార్డు ప్రాతిపదికన మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారుల జాబితా రూపొందించారు. స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయల వ్యయంతో అటు ఈద్‌ కా తోఫాల పంపిణీ, ఇటు అధికారిక ఇఫ్తార్‌ దావత్‌లు నిర్వహిస్తూ అందజేస్తున్నారు.

ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా తోఫాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. నియోజక వర్గ స్థాయిలో అన్ని మండలాల్లో ఆర్‌డీఓ, తహసీల్దార్ల ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక మసీదు కమిటీల సమన్వయం, సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పండుగకు ముందే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వేల సంఖ్యలో ఉన్న పేద ముస్లిం కుటుంబాలు ఈద్‌కా తోఫాలు అందుకుంటున్నారు. ఇప్పటికే నిల్వలను మండల కేంద్రాలకు చేరవేసిన అధికారులు.. రంజాన్‌ పండుగ నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జిల్లా ఈద్‌కా ఇఫ్తార్‌

తోఫాలు దావత్‌కు నిధులు

వరంగల్‌ 3,000 రూ. 12 లక్షలు

హనుమకొండ 2,500 రూ.10 లక్షలు

మహబూబూబాద్‌ 1,250 రూ.05 లక్షలు

జనగామ 2,000 రూ.08 లక్షలు

జేఎస్‌ భూపాలపల్లి 750 రూ.03 లక్షలు

ములుగు 750 రూ. 03 లక్షలు

మొత్తం 10,250 రూ.41 లక్షలు

నిరుపేద కుటుంబాల్లో సంతోషం

రెట్టింపు

ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలకు 10,250 కిట్లు

పేద ముస్లింలకు పండుగకు ముందే తోఫాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది రంజాన్‌ పండుగకు మరిన్ని పంపిణీ చేయాలి. చాలా మంది నిరుపేదలకు అందడం లేదు. పండుగ రోజు ఓ నిరుపేద కుటుంబం కొత్త బట్టలు ధరించి సంతోషంగా ఉంటే అది సమాజానికే గర్వకారణంగా ఉంటుంది. రంజాన్‌కు ఐదు రోజుల ముందు ప్రత్యేక సెలవులు అధికారికంగా ప్రకటించాలి.

– మహ్మద్‌ తాజుద్దీన్‌, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్టేట్‌ సెక్రటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement