● హనుమకొండ కలెక్టరేట్‌లో ఘటన..
హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్‌లో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తమ భూమిని తహసీల్దార్ అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కలెక్టరేట్ భవనం ఎక్కి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కాసేపు కలకలం రేగింది. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రజలనుంచి వినతులు స్వీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన పయ్యావుల మల్లయ్య కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ బాటిల్, పంట మందు డబ్బాతో కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ క్రమంలో మల్లయ్య కుమారుడు పయ్యావుల సాంబరాజు మందు డబ్బా పట్టుకుని కలెక్టరేట్ భవనం ఎక్కి తమ భూమిని తిరిగి తమ పేరుపై పట్టా చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, విషయం క్షణాల్లో కలెక్టరేట్ అంతా వ్యాపించింది. గ్రీవెనన్స్‌కు వచ్చిన ప్రజలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కిందికి దిగితే కలెక్టర్‌తో మాట్లాడించి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు పలుమార్లు చెప్పినా సాంబరాజు వినకుండా పైనే ఉండిపోయాడు. అనంతరం ఓ పోలీస్ అధికారి భవనంపైకి వెళ్లి సముదాయించి కిందికి దింపాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాంబరాజును జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వద్దకు తీసుకెళ్లగా, వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వెంటనే ధర్మసాగర్ తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్యపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బాధితుడు సాంబరాజు తెలిపిన వివరాల ప్రకారం ధర్మసాగర్ రెవెన్యూ పరిధిలో తన తండ్రి పయ్యావుల మల్లయ్యకు 4.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, అందులో నుంచి 10 గుంటల భూమిని అప్పాల మహేందర్ కుటుంబానికి తహసీల్దార్ అక్రమంగా పట్టా చేశారని ఆరోపించారు. దీంతో వారు తమ భూమిపై హక్కు చూపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయంలో, గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, నిరాశతో కుటుంబంతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం మాట్లాడుతూ ఇరు కుటుంబాల మధ్య తగాాదాలు ఉన్నాయని, రికార్డుల ప్రకారం ఇద్దరికీ పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. అక్రమంగా పట్టా చేశారనే ఆరోపణలు సరికాదని, వివాదం ఉంటే సివిల్ కోర్టులో పరిష్కారం పొందాలని సూచించారు.


