కాశిబుగ్గ: తెలంగాణలో చేనేత పరిశ్రమ వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నేత కార్మికులకు ఈ వృత్తి సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది. తరాల నుంచి ఈ వృత్తిని నమ్ముకుని చాలీచాలని సంపాదనతో నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై పిడుగు పడినట్లు తెలంగాణ సర్కారు జీఓ జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాము రేయింబవళ్లు కష్టపడి పోగుపోగు కలుపుతూ తయారు చేసిన కార్పెట్లు, బెడ్‌షీట్ల కొనుగోళ్లకు టెండర్ విధానం గొడ్డలిపెట్టుగా మారిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల చర్యలతో తాము ఉపాధి కోల్పోయే దుస్థితి ఏర్పడుతుందని కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.
చేనేత వృత్తితో వేల కుటుంబాలు ఉపాధి..
వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు పదివేల చేనేత కుటుంబాలు ఆధారపడగా, అనుబంధంగా మరో 15వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 60కు పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, 35 వరకు మ్యాక్స్ సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సంఘాల ద్వారా తయారు చేసిన కార్పెట్లు, బెడ్‌షీట్లు తెలంగాణలో ఉన్న టెస్కో ద్వారా కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆప్కో ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ రంగ సంస్థలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు సరఫరా చేసేవారు. టెస్కో ద్వారానే ఆయా సంఘాలకు డబ్బులు చెల్లించిన తర్వాత కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు.
టెండర్ విధానంతో ఆందోళన..
ఏడున్నర దశాబ్దాల నుంచి ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేస్తున్న విధానానికి స్వస్తి చెబుతూ టెండర్ విధానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించడంపై చేనేత కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నూతన విధానంతో ప్రైవేట్ వ్యక్తులు రంగ ప్రవేశం చేయడం వల్ల వేలాది మంది రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చేతి నిండా పనిదొరకక పస్తులు ఉంటుంటే ‘పుండు మీద కారం చల్లినట్లు’ టెండర్ విధానం ఏమిటంటూ వాపోతున్నారు.
22 రకాల వస్తువుల జాబితాలో కార్పెట్లు,
బెడ్‌షీట్లు..
ప్రస్తుతం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్‌లో 22రకాల కేంద్రీకృత టెండర్ల విధానానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఇందులో నేత కార్మికులకు సంబంధించిన కార్పెట్లు, బెడ్‌షీట్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. తమ గోడు వినిపిస్తున్నా సంబంధిత అధికారి చలించడం లేదంటూ చెబుతున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆందోళనలో వేలాది మంది కార్మికులు
ఉన్నతాధికారుల తీరుపై మండిపాటు
డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు


