
సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి
హన్మకొండ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్ధల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యాం యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని సంఘం కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిందన్నారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదం తెలిపేలా ఒత్తిడి పెంచాలన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ముందుకు వెళ్తే యుద్ధం చేస్తామన్నారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య, నాయకులు బాబు యాదవ్, సౌగాని శ్రీనివాస్, బగ్గీ రాజు, సనత్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.