న్యూస్‌రీల్
అత్యవసర వైద్య సేవల కోసం ఎదురు చూపులు మూడు వైద్య విభాగాలు ఉన్నా .. ప్రయోజనం సున్నా! రోగులను పట్టించుకోని వైద్య సిబ్బంది ప్రాణాలు కాపాడే ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం
ఆదివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2026
జీజీహెచ్ క్యాజువాల్టీకి నిర్లక్ష్యం రోగం
ఉన్నా.. ఉపయోగం సున్నా..!
7
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.6000, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది.
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ ఉచిత ప్రసాద వితరణకు హైదరాబాద్‌కు చెందిన వీరమాచినేని శివప్రసాద్ కుటుంబం శనివారం రూ.1,01,116 విరాళాన్ని అందజేసింది.
పట్నంబజారు: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏపీఎస్‌ఆర్టీసీ రీజియన్ మేనేజర్ డి.సాంబ్రాజ్యం అన్నారు. గుంటూరులో శనివారం సమావేశం నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ
గుంటూరు ఎడ్యుకేషన్: బాల, బాలికలు తమ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు చదువుతోపాటు కళలతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. శనివారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యా భవన్‌లో జాతీయ బాలల దినోత్సవంతో పాటు స్పోర్ట్స్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ శ్రీవాత్సవ మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, సత్ప్రవర్తన, గౌరవభావం, ఇష్టపడి చదవడం, ఆటల్లో చురుకుదనంతో పాటు సామాజిక బాధ్యత పెంపొందించడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కృషి చేయాలని తెలిపారు.
భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు మాట్లాడుతూ బాలల బంగారు భవిష్యత్తు కోసం చిన్న వయసు నుంచే అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించే విధంగా పాఠశాల స్థాయి నుంచి నైపుణ్యత శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు బృందనాట్యం, బుర్రకథ, కవాతుతో పాటు తైక్వాండో విద్యను ప్రదర్శించారు. పాఠశాల కోశాధికారి కేతరాజు రామ్ సుభాష్, ఇంటాక్ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్ హేమాంబ, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ మానస, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో తీవ్ర గాయాలపాలైన వారికి, విషప్రభావానికి గురైన వారికి, తీవ్ర అస్వస్థత ఏర్పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సకాలంలో మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు గుంటూరు జీజీహెచ్‌లో అత్యవసర వైద్యసేవల విభాగం(క్యాజువాల్టీ) ఉంది. ఆస్పత్రికి ఇది గుండెలాంటిది. క్యాజువాల్టీతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన ట్రామా కేర్ సెంటర్, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నూతనంగా మంజూరు చేసిన ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ఉంది. చెప్పుకోవడానికి ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు మూడు వైద్య విభాగాలు ఉన్నప్పటికీ క్యాజువాల్టీకి చికిత్స కోసం వచ్చే బాధితులకు అరకొర వైద్య సేవలే అందుతున్నాయి. జీజీహెచ్‌కు సుమారు ఏడు జిల్లాలకు చెందిన రోగులు ప్రతిరోజూ వివిధ అత్యవసర వైద్యసేవల కోసం ఆస్పత్రికి వస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే బాధితులు చికిత్స సకాలంలో లభించక ప్రైవేటు ఆసుపత్రులకు తరలి పోవడమో, లేక ప్రాణాలు కోల్పోవడమో జరుగుతోంది.
మూడు విభాగాల ఉన్నా మొక్కుబడిగానే!
గతంలో గుంటూరు జీజీహెచ్‌లో రోడ్డు ప్రమాద బాధితులకు, కత్తిపోట్లకు గురైన వారికి, పాము కాటు బాధితులకు, ఇతర అత్యవసర వైద్య సేవలు అందించేందుకు క్యాజువాల్టి మాత్రమే ఉండేది. జీజీహెచ్‌లో డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణ సమయంలో 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు రోడ్డు ప్రమాద బాధితులకు ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ అందించేందుకు ట్రామాకేర్ సెంటర్లను మంజూరు చేసింది. సెంటర్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు, వైద్య పరికరాలు, వైద్య సిబ్బందిని కేంద్రం మంజూరు చేసింది. ట్రామాకేర్ సెంటర్‌లో న్యూరో సర్జరీ, ఆరోపెడిక్ లాంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులను సైతం నియమించి మెరుగైన వైద్యం సకాలంలో అందించి, ప్రాణాలు కాపాడేందుకు ట్రామా కేర్ సెంటర్ వైద్యులు పనిచేయాల్సి ఉంటుంది. కానీ గుంటూరు జీజీహెచ్ ట్రామా కేర్ సెంటర్‌లో 71 పోస్టులకు గాను 20 పోస్టులు రెండేళ్లకు పైగా ఆసుపత్రి అధికారులు భర్తీ చేయకుండా తాత్సారం చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రామాకేర్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్ ఉన్నప్పటికీ దానిని వినియోగించకుండా మూలన పడేశారు.
వేచి చూడడంలోనే ప్రాణాలు హరి..
క్యాజువాల్టీలో ప్రమాద బాధితులు, అత్యవసర చికిత్స బాధితులు రాగానే క్యాజువాల్టీ మెడికల్ ఆఫీసర్ రోగికి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులను, డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్, డ్యూటీ అసిస్టెంట్ సర్జన్‌లను ఫోన్ కాల్ ద్వారా క్యాజువాల్టీకి పిలిపించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రోగి, బాధితులు కొంత మేర కుదటపడిన పిదప మెడికో లీగల్ కేసులకు (ఎంఎల్సీ) డాక్యుమెంటేషన్ సిద్ధం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. క్యాజువాల్టీలో సీఎంఓలుగా విధులు నిర్వహిస్తున్న వారు కేవలం మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి జేబులు నింపుకొనే పనిలో ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంఎల్సీ కేసులు క్యాజువాల్టీకి వచ్చినప్పుడు పోలీసు సమాచారం మాత్రం సిద్ధం చేసి, మిగతా చికిత్సలు తమకు సంబంధం లేదన్నట్లుగా బాధితులను వేచి ఉంచుతున్నారని బాధితులు వాపోతున్నారు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా గుంటూరు జీజీహెచ్ క్యాజువాల్టి పనితీరు ఉండటంతో ఎమర్జెన్సీ చికిత్సల కోసం వచ్చే రోగుల ప్రాణాలకు గ్యారెంటీ ఉండటం లేదు.
రోడ్డు ప్రమాద బాధితులకు ట్రామాకేర్‌తో ఏవిధంగా మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలో, అదే తరహాలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ద్వారా నాన్ ఎంఎల్సీ కేసులకు సత్వర చికిత్స అందించి ప్రాణాలు కాపాడాల్సి ఉంది. కానీ ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్య విభాగం పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఎమర్జన్సీ మెడిసిన్ వైద్యులు తమ సొంత ప్రాక్టీస్‌లో ఉండి జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులను అశ్రద్ధ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రిళ్లు అసలు ఎమర్జన్సీ మెడిసిన్ వైద్యులే ఉండటం లేదు. అందుకు నిదర్శనం క్యాజువాల్టీలో గంటల కొద్ది కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి రోగులు వేచి ఉండాల్సి రావడమే.


