రూ.2.30 కోట్లకు సర్పంచ్ పదవి రూ.4.20 లక్షలకు ఉపసర్పంచ్ పదవి అధికార పార్టీ ముఖ్యనేత సమక్షంలోనే పదవుల ఎంపిక వేటపాలెం మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీలో ఘటన గ్రామాభివృద్ధి కోసమా? పెట్టుబడికి ప్రతిఫలం కోసమా?
అభివృద్ధి కోసమా.. ఆర్జన కోసమా ?
వేటపాలెం: గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలవాల్సిన పంచాయతీ ఎన్నికలు వేలం పాటల ద్వారా అపహాస్యంగా మారుతున్నాయి. ప్రజల ఓట్లతో ప్రజాప్రతినిధులు ఎన్నిక కావల్సి చోట నోట్ల కట్టలతో పదవులను దక్కించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీలో చోటుచేసు కున్న సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల వేలం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ముఖ్యనేత సమక్షంలోనే పదవుల కోసం వేలం నిర్వహించినట్లు సమాచారం. ఈ పంచాయతీ పరిధిలో కఠారివారి పాలెం, పోట్టిసుబ్బయ్యపాలెం, క్తొత్తపాలెం గ్రామాలతో పాటు జబ్బారు కాలనీ, కొణిజేటి చేనేత పురి కాలనీలున్నాయి. ఈ నెలలో జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపపథ్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల కోసం వేలం పాట నిర్వహించినట్లు ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకొంటున్నారు. సర్పంచ్ పదవిని కఠారివారిపాలెంకి చెందిన రమేష్ రూ. 2.30 కోట్లకు పాడి దక్కించుకున్నట్లు సమాచారం. ఈ వేలం పాటలో శ్రీను, అర్జున అనే మరో ఇద్దరు కూడా పోటీపడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉప ససర్పంచ్ పదవిని కొత్తపాలేనికి చెందిన పెద్దన్న రూ. 4.20 లక్షలకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రజాస్వామ్యానికి తూట్లు!
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి, గ్రామ ప్రజలు తమకు నచ్చిన నాయకులను ఓటు హక్కులతో ఎన్నుకోవాల్సింది. కానీ రాజకీయ నేతల సమక్షంలోనే వేలం ద్వారా ప్రజా ప్రతినిధులను ఎంపిక చేసుకోవడం, ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు ముందే పదవులు డబ్బులతో ఖరారు చేసుకుంటే ప్రజల ఓటు హక్కుకు విలువ ఏముంటుందని మేధావులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారం పై ఎన్నికల అధికారులు విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
పెరిగిన భూముల విలువే వేలానికి కారణం ?
చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కఠారివారిపాలెం, పొట్టి ససుబ్బయ్యపాలెం ప్రాంతాల్లో సముద్రతీరం పర్యాటకంగా గోవా తరహాలో అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతంలో భూముల ధరలు ఎకరాకు రూ.12 కోట్ల వరకు పలుకుతున్నాయి. దీంతో పంచాయతీకి భవిష్యత్‌లో భారీ ఆదాయ వనరులు సమకూరే అవకాశం ఉందని భావించి సర్పంచ్ పదవికి భారీ మొత్తం వెచ్చించారన్న ప్రచారం జరుగుతోంది. గ్రామాభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా ఉండాల్సిన సర్పంచ్ పదవి కోట్ల రూపాయల వేలం వ్యవహారంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజల చేత ఎన్నికై న ప్రజాప్రతినిధులు వేలం ద్వారా ఖరారవుతున్నారన్న ఆరోపణలపై ఎన్నికల అధికారుల స్పందించి విచారణ చేపడతారా? ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.
సర్పంచ్ పదవి కోసం రూ. 2.30 కోట్లు వెచ్చించారన్న ప్రచారం గ్రామాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసి పదవిని దక్కించుకున్న వ్యక్తి ఐదేళ్ల పాటు గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారా? లేక పదవి ద్వారా పెట్టిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేస్తారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించే నిదులు సక్రమంగా వినియోగాస్తారా? లేక అక్రమాలకు పాల్పడే అవకావాలుంటాయా? అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.


