పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేకాధికారుల నియామకం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేకాధికారుల నియామకం

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేకాధికారుల నియామకం

గుంటూరు వెస్ట్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేకాఽధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ ఉత్తర్వులు విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గుంటూరు రూరల్‌కు జిల్లా సహకార అధికారి ఇ.రత్నావతి, మేడికొండూరు మండలానికి జిల్లా వ్యవసాయ అధికారి ఎం పద్మావతి, పెదకాకాని మండలానికి జిల్లా అటవీ అధికారి ఎం హిమ శైలజ, పెదనందిపాడు మండలానికి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పీపీజీ ప్రసూన, ఫిరంగిపురం మండలానికి జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె మయూరి, ప్రత్తిపాడు మండలానికి హౌసింగ్‌ పీడీ జె.వి.ఎస్‌.ఆర్‌.కె ప్రసాద్‌, వట్టిచెరుకూరు మండలానికి డ్వామా పీడీ వి శంకర్‌, చేబ్రోలు మండలానికి డీఎస్‌ఓ కోమలి పద్మ, దుగ్గిరాల మండలానికి ఏపీ మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ టి నరసింహారెడ్డి, కాకుమాను మండలానికి భూగర్భ జల ఉపసంచాలకులు డి.వందనం, కొల్లిపర మండలానికి జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.క్రిష్టి అభినవ్‌, పొన్నూరు మండలానికి డీఆర్డిఏ పీడీ వి విజయలక్ష్మి, తెనాలి మండలానికి ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డి దుర్గాభాయిని నియమించామన్నారు.

16న పీఓలకు,

17న ఓపీఓలకు శిక్షణ

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారులకు (పి.ఓలు) ఈ నెల 16న, ఇతర పోలింగ్‌ సిబ్బందికి (ఓ.పి.ఓలకు) 17వ తేదీన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి జరిగే శిక్షణ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరయ్యే ఉద్యోగుల పట్ల ఎన్నికల నిబంధనల మేరకు క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు

రాష్ట్రంలో రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం టెలి కాన్ఫరెనన్స్‌ నిర్వహించారు. అక్టోబరు 21, 27 తేదీల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియ సజావుగా, ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలన్నింటిలోను, లెక్కింపు కేంద్రాల్లోనూ వీడియో రికార్డింగ్‌ లేదా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణకు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు రక్షణ కోరే అభ్యర్థులకు అవసరాల ఆధారంగా భద్రత కల్పించాలని, పోలీసు సూపరింటెండెంట్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి సత్వర పరిష్కరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement