పెదకాకాని: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు తర్వితగతిన స్వామి, అమ్మవార్ల దర్శనం జరిగేందుకు ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు. కార్తీక దీపారాధనలు చేసుకొనుటకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అన్నప్రసాద వితరణకు తగిన ఏర్పాటు చేశారు.
అంత్రాల అభిషేకాలు రద్దు
కార్తికమాసం ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆది, సోమవారం, పౌర్ణమి రోజులలో రూ.400 అభిషేకాలు ఆలయ ఈశాన్య భాగంలో అభిషేక మండపంలో జరుగుతాయని దేవస్థాన ఉప కమిషనర్ పి శ్రీనివాసులురెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు తెలిపారు. రూ.100 అభిషేకం పూర్తిగా నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ అంత్రాలయంలో స్వామివారి దర్శనం కోసం మాత్రమే భక్తులను అనుమతిస్తామని తెలిపారు. వాహనపూజలు మధ్యాహ్నం 3 గంటల వరకూ నిలుపుదల చేసినట్లు తెలిపారు. భక్తులందరూ కార్తీకమాస పర్వదినాలలో మల్లేశ్వరస్వామి క్షేత్రానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని అభిషేకాలు జరిపించుకోవాలని దేవస్థాన ఉప కమిషనర్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.
మూడు టిప్పర్లు, పొక్లెయిన్ స్వాధీనం
రాజుపాలెం: మండలంలోని బీరవల్లిపాయ గ్రామ సరిహద్దుల్లో అటవీ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పక్కా సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించింది. మూడు టిప్పర్ల, ఒక పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మూడు టిప్పర్లు, పొక్లెయిన్‌ను అటవీ అధికారులకు సమాచారం అందించి అప్పగించారు. దీనిపై పిడుగురాళ్ల అటవీ శాఖ డీఆర్వో రాంమోహన్‌రావును వివరణ కోరగా తవ్వకాలు జరుగుతున్న మాట వాస్తవమేనని, గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను స్వాధీనం చేసుకుని అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం అటవీ శాఖదా, రెవెన్యూ శాఖకు చెందిందా అనేది మ్యాప్ చూసి తేలుస్తామని, అటవీ భూమి అని నిర్ధారణ అయితే వాహనాలపై, యజమానులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
న్యూఢిల్లీలో సీఏపీఎస్‌ఐ సమావేశంలో బహూకరణ
తెనాలి: జాతీయ భద్రత, తీరప్రాంత భద్రత, సైబర్ సెక్యూరిటీపై గత దశాబ్దంన్నర కాలంగా కృషిచేస్తున్న తెనాలికి చెందిన డాక్టర్ కన్నెగంటి రమేష్‌బాబుకు నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో శుక్రవారం రోజంతా జరిగిన సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఏజెన్సీల జాతీయ అసోసియేషన్ (సీఏపీఎస్‌ఐ) సమావేశంలో ఆయనకు ఈ గౌరవం లభించింది. ఇండియన్ ఆర్మీ విశ్రాంత చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతులమీదుగా ఈ అవార్డును స్వీకరించారు. జాతీయ భద్రతపై యూజీసీ నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రమేష్‌బాబు హైదరాబాద్‌లో ‘సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ సర్వీస్’కు వ్యవస్థాపకుడిగా పోలీసు అధికారులు, యూనివర్శిటీలతో సహా పలు సంస్థలకు జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణ, సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కృషికి గుర్తింపుగా జాతీయ అవార్డు వరించినందుకు రమేష్‌బాబు సంతోషం వ్యక్తంచేశారు.


