గుంటూరు రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికితీసి, వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఉన్నత లక్ష్యంతో చలపతి ఫార్మసీ కళాశాల ప్రతిష్టాత్మకంగా బీట్స్ వగాంజా 3.0 నేషనల్ లెవల్ యూత్ ఫెస్ట్ 2026ను నిర్వహించనున్నట్లు చలపతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ వైవీ ఆంజనేయులు తెలిపారు. శనివారం నగర శివారుల్లోని లాం కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పల్లవి వడ్లమూడితో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. కళాశాల అధినేత మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నిర్వహించనున్న కార్యక్రమంలో విద్యార్థుల్లో విద్యాపరమైన ప్రతిభతో పాటు కళలు, సంగీతం, నృత్యం, నటన, సాహిత్యం, సృజనాత్మకత వంటి విభిన్న రంగాల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి జాతీయ స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. విద్యార్థులు తమలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ వివిధ రంగాల్లో తమ సత్తా చాటుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జాతీయ స్థాయి యువజనోత్సవం వివిధ కళాశాలల విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించనుందన్నారు. ఈ సందర్భంగా మొత్తం 12 విభిన్న విభాగాల్లో సాంస్కృతిక, సృజనాత్మక, వినోదాత్మక పోటీలను నిర్వహించనున్నారన్నారు.
నగరంపాలెం: విలక్షణ నటుడు గిరిబాబు మృతి గుంటూరు ప్రేక్షకులను కలిచివేసింది. ఆయన నటించిన పలు చిత్రాల్లోని సన్నివేశాలను గుర్తుచేసుకున్నారు. గతంలో గుంటూరు నగరంలోని పలు సినీ అనుబంధ సంస్థలు గిరిబాబుని సత్కరించాయి. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత గిరిబాబుకి ఈవీవీ యువ కళా వాహినితో అనుబంధం ఉందని, ఆయన మృతిచెందడం బాధకరమని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ తరఫున గిరిబాబును పలుమార్లు సత్కరించామని అన్నా రు. నటుడిగా, నిర్మాతగా గిరిబాబు తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని అన్నారు. 2102లో గుంటూరు నగరంలోని ఓ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో నటుడు గిరిబాబుకి ఉగాది పురస్కారం, వెండి కిరీటంతో సత్కరించినట్లు కళాదర్బార్– అమరావతి అధ్యక్షుడు పొత్తూరి రంగారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతో అప్యాయతతో పలకరించేవారని, గర్వంలేని మంచి నటుడు గిరిబాబు అని చెప్పారు. చిత్ర పరిశ్రమల్లో కష్టపడి వచ్చిన వారిలో గిరిబాబు ఒకరని గుర్తుచేసుకున్నారు.
ప్రొద్దుటూరు కల్చరల్: ప్రొద్దుటూరు పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన నడమల భాగ్యశ్రీ ఆంగ్ల సాహిత్యంలో చేసిన పరిశోధనకుగాను పాట్నా ఐఐటీ డాక్టరేట్ ప్రదానం చేసింది.
‘సమకాలీన తెలుగు సినిమాలో దళిత మహిళలపై వివాదాస్పద ప్రాతినిధ్యాలు (1990–2021)‘ అనే అంశంపై పాట్నా ఐఐటీ ఆచార్యులు ప్రియాంక త్రిపాఠీ మార్గదర్శకత్వంలో ఆమె పరిశోధన పూర్తి చేశారు. ప్రస్తుతం గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భాగ్యశ్రీ, రచయిత్రిగా, క్రీడా సృజనకారిణిగా కూడా ప్రతిభ చాటారు. ‘ఉత్తర రామాయణంలో సీతాదేవి ఆత్మపరిశీలన’, ‘బాలల బొమ్మల జిరాఫీ చెస్ కథ’ పుస్తకాలను రచించారు. పాఠశాల స్థాయిలోనే 68 గళ్లు గల, ’డ్రా’ లేని సరికొత్త ‘జిరాఫీ చెస్’ ఆటను రూపొందించారు. డాక్టరేట్ అందుకున్న సందర్భంగా భాగ్యశ్రీని తల్లిదండ్రులు గంగాధర్‌రెడ్డి, శైలజలతో పాటు విజ్ఞాన్ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగ అధ్యాపకులు అభినందించారు.


