ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో అరవికి స్వర్ణం | - | Sakshi
Sakshi News home page

ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో అరవికి స్వర్ణం

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

రాణించిన జస్వంత్‌, ధృవ్‌ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లు కై వసం

విశాఖ స్పోర్ట్స్‌: సబ్‌ జూనియర్‌ అంతర్‌ జిల్లాల ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో విశాఖకు చెందిన సోనమ్‌, గుంటూరుకు చెందిన అరవి స్వర్ణ పతకాలతో సత్తా చాటారు. వ్యక్తిగత విభాగాల్లో చాంపియన్లుగా నిలిచి ప్రతిభను చాటుకున్నారు. బాలుర విభాగంలో గుంటూరుకు చెందిన జస్వంత్‌, విశాఖకు చెందిన ధృవ్‌ సైతం పతకాలతో మెరిశారు. విశాఖ సాగరతీరంలోని ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జిల్లా స్విమ్మింగ్‌ సంఘం ఆధ్వర్యంలో శనివారం గ్రూప్‌–4లో ఐదు, గ్రూప్‌–5లో మూడు అంశాల్లో పోటీలు నిర్వహించారు. గ్రూప్‌–5 బాలుర విభాగంలో విశాఖకు చెందిన ఎం.ధృవ్‌ ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించగా.. బాలికల విభాగంలో గుంటూరుకు చెందిన బి.అరవి మూడు స్వర్ణాలు గెలుచుకుని వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ కై వసం చేసుకున్నారు. గ్రూప్‌–4 బాలుర విభాగంలో గుంటూరుకు చెందిన టి.జస్వంత్‌ మూడు స్వర్ణాలు, ఒక రజతం సాధించగా.. బాలికల విభాగంలో విశాఖకు చెందిన సోనమ్‌ నాలుగు స్వర్ణాలు కొల్లగొట్టి వ్యక్తిగత చాంపియన్‌గా నిలిచారు. ఓవరాల్‌ జిల్లా ర్యాంకింగ్స్‌లో విశాఖ 107 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కాకినాడ 62, గుంటూరు 58, బాపట్ల 24 పాయింట్లతో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి.

గ్రూప్‌–4 స్వర్ణ విజేతలు

100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో బాలికల విభాగంలో సోనమ్‌ (విశాఖ), బాలుర విభాగంలో శ్రీయాన్‌ ఆనంద్‌ (బాపట్ల) స్వర్ణాలు సాధించారు. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో బాలుర విభాగంలో జస్వంత్‌ (గుంటూరు), బాలికల విభాగంలో సోనమ్‌ (విశాఖ) విజేతలుగా నిలిచారు. 100 మీటర్ల బటర్‌ఫ్లైలో బాలుర విభాగంలో శ్రీయాన్‌ ఆనంద్‌ (బాపట్ల), బాలికల విభాగంలో సోనమ్‌ (విశాఖ) పసిడి పతకాలు అందుకున్నారు. 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బాలుర విభాగంలో జస్వంత్‌ (గుంటూరు), బాలికల విభాగంలో సాగరిక (కాకినాడ) విజయం సాధించారు. 200 మీటర్ల ఇండివిడ్యువల్‌ మెడ్లేలో బాలుర విభాగంలో 3.20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్న జస్వంత్‌ (గుంటూరు), బాలికల విభాగంలో 3.23 నిమిషాల్లో పూర్తి చేసిన సోనమ్‌ (విశాఖ) స్వర్ణాలు కై వసం చేసుకున్నారు.

గ్రూప్‌–5 స్వర్ణ విజేతలు

50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో బాలుర విభాగంలో మిఖేల్‌ (కాకినాడ), బాలికల విభాగంలో అరవి (గుంటూరు) స్వర్ణాలు సాధించారు. బ్యాక్‌స్ట్రోక్‌లో బాలుర విభాగంలో ర్యాన్‌ ఫ్లైన్‌ (కాకినాడ), బాలికల విభాగంలో అరవి (గుంటూరు) విజేతలుగా నిలిచారు. 50 మీటర్ల బటర్‌ఫ్లైలో బాలుర విభాగంలో ధృవ్‌ (విశాఖ), బాలికల విభాగంలో రియా కృష్ణ (విశాఖ) పసిడి పతకాలు అందుకున్నారు. 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బాలుర విభాగంలో మహేంద్రరామ్‌ (విశాఖ), బాలికల విభాగంలో అరవి (గుంటూరు) స్వర్ణాలు కై వసం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement