భార్య వియోగం భరించలేక ఆగిన భర్త గుండె | - | Sakshi
Sakshi News home page

భార్య వియోగం భరించలేక ఆగిన భర్త గుండె

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

భార్య అంత్యక్రియలు ముగిసిన మరుసటిరోజే భర్త హఠాన్మరణం హయ్యర్‌పేటలో విషాదం

తెనాలి: భార్యాభర్తల అనుబంధం మాటల్లో చెప్పలేనిది... జంట పక్షుల్లాంటి దాంపత్యబంధంలో ఒకరు కన్నుమూస్తే, మరొకరికి ఆ వియోగాన్ని భరించటం దుర్భరం. వర్ణనాతీతమైన ఆ మనోవేదనకు ఒంటరి పక్షి హృదయం తల్లడిల్లుతుంది. ఒక్కోసారి మరణానికి దారితీస్తుంది. పట్టణ హయ్యర్‌పేటకు చెందిన భార్యాభర్తలు పిల్లి తిరుపతరావు, పద్మ ఇందుకో నిదర్శనం. భార్య మరణించిన రోజు వ్యవధిలోనే గుండెపగిలి భర్త కూడా మరణించటం ఆ ప్రాంతవాసులను కలచివేసింది. వైఎస్సార్‌ సీపీ క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరించే పిల్లి తిరుపతరావు, ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన భార్య పద్మ రెండో వార్డు నుంచి కౌన్సిలరు అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేశారు. జీవనోపాధికి అల్లిక కుర్చీల తయారీలో కొనసాగుతున్న తిరపతరావుకు అందులో మంచి నైపుణ్యం కలిగి ఉంది. పిల్లలు లేకపోవటంతో ఒక పాపను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం బీటెక్‌ సెకండియర్‌ చదువుతోంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో పద్మ హఠాన్మరణం చెందారు. తీరని దుఃఖంతో కుమిలిపోతూనే శుక్రవారం అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. తీవ్ర మనోవేదనకు లోనైన తిరుపతరావు(53) ఆ దుఃఖంలోనే శనివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురయ్యారు. భార్య మరణాన్ని తట్టుకోలేని ఆ గుండె ఆగిపోయి ఉంటుందని అందరికీ అర్థమైంది. ఇద్దరినీ కోల్పోయిన వారి కుమార్తె, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హయ్యర్‌పేటలో జరిగిన విషాదం ఆ ప్రాంతవాసులను తీవ్ర విచారానికి గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement