గుంటూరు మెడికల్: బాలల దినోత్సవం, ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులోని లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చిన్నారుల కోసం ఉచిత పీడియాట్రిక్ అవుట్ పేషెంట్ విభాగాన్ని శనివారం ప్రారంభించారు. 1 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు, నిపుణుల వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పి.వి.రాఘవశర్మ తెలిపారు. ప్రస్తుత కాలంలో చిన్నారుల్లో టైప్–1 మధుమేహం, కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలు, అలర్జీలు, ఆస్తమా, మూర్ఛ, తలనొప్పి, ఆటిజం స్పెక్ట్రమ్ సమస్యలు, నాడీ సంబంధిత, మానసిక ఆరోగ్య సమస్యలు, కంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఉచిత పీడియాట్రిక్ అవుట్ పేషెంట్ విభాగాన్ని సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 2027 జనవరి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అవసరమైన వారికి జనరల్ పీడియాట్రిషియన్లు, పీడియాట్రిక్ కంటి వైద్య నిపుణులు, దంత వైద్య నిపుణులు, న్యూరాలజిస్టులు, సైకియాట్రిస్టులు, డైటీషియన్లతో కూడిన బహుళ విభాగాల వైద్య బృందం సేవలు అందిస్తుందన్నారు.


