వేమూరు: బాపట్ల జిల్లా వేమూరు పోలీసుస్టేషన్ సీఐ షేక్ నఫీజ్ బాషా అరుదైన జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక కేంద్ర హోంమంత్రి రక్షణ పతకం–2026కు దేశ వ్యాప్తంగా ఎంపికై న 123 మంది దర్యాప్తు అధికారుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేవలం నలుగురు పోలీస్ అధికారులు ఎంపిక కాగా వారిలో నఫీజ్ బాషా ఒకరు కావడం విశేషం. గుంటూరు పోలీస్ రేంజ్ నుంచి ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికై న ఏకై క పోలీసు అధికారిగా నిలిచారు. విధి నిర్వహణలో నీతి, నిజాయతీ, అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచన నఫీజ్ బాషా గతంలోనూ పలు జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. తాజాగా జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక కావం పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచింది. ఉన్నత పోలీస్ అధికారులు ఆయనను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి పోలీస్ శాఖకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
యడ్లపాడు: మురసు తుపాను కారణంగా చారిత్రక కొండవీడు కోట సందర్శనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కొండపై మట్టి కరిగిపోవడం, బండరాళ్లు జారిపడే అవకాశం ఉండటంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా సందర్శనలను రద్దు చేసినట్లు నరసరావుపేట ఫారెస్టు రేంజ్ అధికారి డీవీ రమణ తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమ, మంగళవారం రెండు రోజులపాటు కొండవీడు కోట సందర్శనను నిలిపివేసినట్లు ఆమె వెల్లడించారు. కొండ దిగువన ఉన్న చెక్పోస్టును తాత్కాలికంగా మూసినవేసినట్లు తెలిపారు. తుఫాన్ అనంతరం తిరిగి ప్రకటించే వరకు పర్యాటకులు కొండవీడు వైపు రావద్దని, అధికారుల సూచనలను పాటించి సహకరించాలని కోరారు.
పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థాన నూతన కార్యనిర్వహణాధికారిగా పి శ్రీనివాసులురెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శివాలయం ఈఓగా పనిచేస్తున్న గోగినేని లీలాకుమార్ వ్యక్తిగత కారణాలతో రెండు నెలలు సెలవుపై వెళ్లారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవదాయశాఖ ఉప కమిషనర్ పి శ్రీనివాసులురెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయన భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం ప్రకాశం జిల్లా మాలకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉప కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నగరంపాలెం: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో భాగంగా సోమవారం బాపట్ల పట్టణం కొండలరావువీధిలోని ఝాన్సీలక్ష్మీ రైస్ ట్రేడర్స్ దుకాణంలో విజిలెన్న్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక తూనికలు/కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు రకాలైన బియ్యం, ఇతర సరుకుల ధరలను దుకాణ యాజమాని అల్లం సాంబశివరావుని అడిగి తెలుసుకున్నారు. ఏ రకం బియ్యం ఏ ధరకు విక్రయిస్తున్నారనేది రికార్డులు తనిఖీ చేశారు. బియ్యం బస్తాలపై తయారీదారుని పేరు, ధరల ముద్రణ లేకపోవడంపై లీగల్ మెట్రాలజీ కేసులు నమోదు చేశారు.


