జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం: మురసు తుపాను దృష్ట్యా సహాయక చర్యల కోసం ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (సీఐలు), డీఎస్పీలతో సోమవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తుపాను ప్రభావం మంగళవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జేసీబీలు, ఇతర సహాయక సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను పాటించాలని అన్నారు. వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రమాదకర ప్రాంతాలను ముందుగా గుర్తించాలని చెప్పారు. ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లనీవ్వద్దని, నీటి ప్రవాహంలో చిక్కుకోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వాహనాలు, లారీలను సురక్షిత ప్రాంతాల్లో తాత్కాలికంగా నిలుపుదల చేయాలని అన్నారు.
ప్రతి పదిహేను కిలోమీటర్లకు వాహనాల నిలుపుదల ప్రాంతాలు అనువుగా ఉండేలా చర్యలు చేపట్టాల న్నారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సురక్షితంగా ఉండాల్సిన విధానాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. తుపాను సహాయక కేంద్రాల్లోని ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. ప్రతి మూడు లేదా నాలుగు గ్రామాలకు ఒక కానిస్టేబుల్‌ను నియమించాలని పేర్కొన్నారు. ప్రజా, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది విధులు నిర్వర్తించాలని అన్నారు.


