ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఊరట | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఊరట

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

జీవో నంబర్‌ 7 గడువు మూడు నెలలు పొడిగింపు

ప్లాట్ల నగదు చెల్లింపునకు ఏపీఐఐసీ ఎండీ అంగీకారం

ఆన్‌లైన్‌లో తొలగించిన ప్లాట్ల పునరుద్ధరణకు సానుకూలత

మంగళగిరి టౌన్‌: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.7 అమలులో భాగంగా ప్లాట్లకు నగదు చెల్లింపులు చేసేందుకు మరో మూడు నెలల గడువు కల్పించనున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో తొలగించిన ప్లాట్లను తిరిగి పునరుద్ధరించేందుకు కూడా అంగీకరించారు. ఈ అంశంపై సోమవారం ఏపీ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు అనార్‌ బాబు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఏపీఐఐసీ ఎండీని కలిసి వినతిపత్రం సమర్పించి చర్చించింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించిన ప్లాట్లకు నగదు చెల్లించేందుకు తగిన సమయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎండీ మరో మూడు నెలల గడువు కల్పించేందుకు అంగీకరించడంతోపాటు, ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. అనంతరం ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈ.ప్రతాప్‌, సీజీఎం చంద్రశేఖర్‌, జీఎం వెంకటేశ్వరరావులను కూడా ప్రతినిధి బృందం కలిసింది. అర్హులైన పారిశ్రామికవేత్తలు తమ ప్లాట్లకు సంబంధించి గడువు పొడిగింపు కోరుతూ జోనల్‌ మేనేజర్లకు వ్యక్తిగతంగా లేఖలు సమర్పించాలని అధికారులు సూచించారు. సానుకూలంగా స్పందించిన ఏపీఐఐసీ ఎండీతో పాటు ఇతర అధికారులకు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వి. భక్తవత్సలం, డాక్టర్‌ ఎం.నవీన్‌, కై లా శేషయ్య, వినోద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement