అన్నదాత..కన్నీటి వ్యథ | - | Sakshi
Sakshi News home page

అన్నదాత..కన్నీటి వ్యథ

Nov 3 2026 1:57 AM | Updated on Nov 3 2026 1:57 AM

అన్నదాత..కన్నీటి వ్యథ ప్రకృతి ప్రకోపం.. సర్కారు నిర్లక్ష్యం

వాతావరణ పరిస్థితులు, తుఫాన్లతో కష్టాల సుడిగుండంలో రైతన్న అర్నబ్‌ తుఫాన్‌తో ప్రాథమికంగా జిల్లాలో 23 వేల ఎకరాల్లో పంట నష్టం ఏడాది గడిచినా 3,800 మంది రైతులకు ఇప్పటికీ అందని ‘మోంథా’ పరిహారం రైతుల కష్టాలు పట్టని టీడీపీ ప్రభుత్వం పెట్టుబడులు నేలపాలు.. అప్పుల ఊబిలో అన్నదాతలు పాత నష్టానికి పరిహారం లేదు.. కొత్త నష్టానికి భరోసా లేదు!

పరిహారం.. పరిహాసం

ప్రకృతి ప్రకోపం.. సర్కారు నిర్లక్ష్యం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతకు ప్రకృతి పరీక్ష పెడుతోంది. ఒకవైపు వాతావరణ పరిస్థితుల్లో మార్పులు.. మరోవైపు వరుస తుఫాన్లు, అకాల వర్షాలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. సాగు ప్రారంభం నుంచి పంట చేతికొచ్చే వరకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గగా, సాగు చేసిన పంటలు సైతం తుఫాన్ల ప్రభావంతో దెబ్బతింటున్నాయి. గుంటూరు జిల్లాలో ఇటీవల సంభవించిన అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సుమారు 23 వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

రైతులకు మరింత భారం

వాతావరణ ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు వర్షపాతం ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రైతులు సాగు విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో.. ఎప్పుడు ఎండలు తీవ్రతరం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. పంటల సాగు ప్రణాళికలు తారుమారవుతున్నాయి. పైపెచ్చు టీడీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం కూడా సరిగా ఇవ్వకపోవడంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి సాగు ఖర్చులకు రైతులు అప్పులపాలవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాతావరణ అనిశ్చితి రైతులకు మరింత భారంగా మారుతోంది. ఒకవైపు అప్పులపై వడ్డీలు పెరుగుతుండగా, మరోవైపు కుటుంబ పోషణ, పిల్లల చదువులు, తదుపరి సాగు ఖర్చులు భారంగా మారుతున్నాయి. దీంతో పలువురు రైతులు తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు.

వరుస తుఫాన్లతో పంటలకు దెబ్బ

గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుఫాను రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. పలు ప్రాంతాల్లో 6,062.21 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఏడాది గడిచినా ఇప్పటికీ రైతులకు పరిహారం అందలేదు. ఆ నష్టాల నుంచి రైతులు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకముందే ఇటీవల అర్నబ్‌ తుఫాన్‌ మరోసారి విరుచుకుపడింది. జిల్లాలో సుమారు 23 వేల ఎకరాల్లో వరి, పత్తి, మినుము తదితర వ్యవసాయ పంటలతో పాటు అరటి, కూరగాయలు, పూల తోటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పొలాల్లో నీరు నిలిచిపోవడం, పంటలు నేలకొరగడం, ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

కలవరపెడుతున్న రైతు ఆత్మహత్యలు

వ్యవసాయంలో వరుస నష్టాలు, అప్పుల భారం, పెట్టుబడులు తిరిగి రాకపోవడం వంటి సమస్యలు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రకతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు సకాలంలో ఆర్థిక సాయం అందకపోతే పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉంది. రైతులకు భరోసా కల్పించడంతో పాటు ఆర్థికంగా ఆదుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆదుకోవాలని వేడుకోలు..

తాజా మురసు తుఫాన్‌ అన్నదాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇటీవల సంభవించిన అర్నబ్‌ తుఫాన్‌కు నష్టపోయిన పంటలను వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి పరిహారం జాబితాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఏడాది మొంథా తుఫాన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.5.75 కోట్ల పరిహారాన్ని వెంటనే విడుదల చేయడంతో పాటు, అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టానికి కూడా తగిన పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు ఒకవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు అప్పుల భారం.. మరోవైపు ఆదుకోని ప్రభుత్వం.. ఇలా జిల్లా రైతాంగం మూడు వైపులా సమస్యలతో సతమతమవుతోంది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతకు ప్రభుత్వం అండగా నిలిచి తక్షణ ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉందని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నారు.

మోంథా తుఫాన్‌ నష్టపరిహారం విషయంలో రైతులకు నిరాశే ఎదురవుతోంది. తుఫాన్‌ సంభవించి ఏడాది గడిచినా జిల్లాలో సుమారు 3,800 మంది రైతులకు రూ.5.75 కోట్ల మేర పరిహారం ఇంతవరకు కూటమి ప్రభుత్వం అందించనే లేదు. పంటలు నష్టపోయిన సమయంలో ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఆశించిన రైతులకు ఇంతవరకు ఎదురుచూపులే మిగిలాయి. పరిహారం అందకపోవడంతో అప్పులు తీర్చలేక, తదుపరి పంట సాగుకు పెట్టుబడులు సమకూర్చుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాత నష్టపరిహారమే అందని పరిస్థితుల్లో తాజాగా తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టంతో వారి కష్టాలు మరింత పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురసు తుఫాన్‌తో అన్నదాతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement