మహిళలపై దుశ్శాసన పర్వం
వినుకొండలో యథేచ్ఛగా రిగ్గింగ్
ఖాకీ అండ...
గుంటూరు కార్పొరేషన్‌తోపాటు పల్నాడులోని మున్సిపాలిటీల్లోనూ అరాచకం
● ఏజెంట్లను బయటకు లాగేసి
రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ గూండాలు
● వైఎస్సార్ సీపీ నేతలు,
ఓటర్లను అడ్డుకున్న పోలీసులు
● మహిళలని కూడా చూడకుండా
దాడులకు తెగబడ్డ పచ్చ రౌడీలు
● వైఎస్సార్ సీపీ గుంటూరు మేయర్
అభ్యర్థి శ్రీదేవి, ఏజెంట్‌పై దాడి
● చిలకలూరిపేట, వినుకొండ,
మాచర్లలోనూ మహిళలను
ఈడ్చిపడేసిన పచ్చ మూకలు
● యథేచ్ఛగా రిగ్గింగ్.. వైఎస్సార్ సీపీ
అభ్యర్థులను సైతం బూత్ వైపు
రానివ్వని పోలీసులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసులు పోలింగ్‌కు ముందు రోజు శనివారం అర్ధరాత్రి నుంచే అన్ని మున్సిపాలిటీల పరిధిలో వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, అభ్యర్థుల కుటుంబ సభ్యులను అక్రమంగా నిర్బంధించారు. కనీసం ఓట్లు వేయనీయని దుర్మార్గ పరిస్థితిని సృష్టించారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలందరినీ హౌస్ అరెస్టులు చేసి, టీడీపీ గూండాలతో పోలీసులే దగ్గరుండి అరాచక పర్వానికి తెరతీశారు. మహిళలని కూడా చూడకుండా చీరలు లాగి, వారిపై సైతం దాడులకు పచ్చమూకలు తెగబడ్డాయి.
గుంటూరు నగరంలో టీడీపీ గూండాలు పలు పోలింగ్ కేంద్రాల వద్ద దౌర్జన్యాలకు తెగబడ్డారు. 57వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వెళుతున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేత భాస్కర్‌రెడ్డిపై విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. 42వ వార్డులో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తాడిశెట్టి మురళి.. ఏజెంట్‌ను బెదిరించి బయటకు పంపాక రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 59వ వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెంకటేశ్వర్లు నాయక్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారు. పొన్నూరు రోడ్డులోని అంజుమన్ పాఠశాల వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన 40 మందిని వైఎస్సార్ సీపీ నేతలు వెనక్కి పంపించారు. టీడీపీ నేత భీమనాథం భరత్‌రెడ్డి పోలింగ్ కేంద్రాల వద్ద కారులో హల్‌చల్ చేస్తుండగా ఫొటో తీశారనే నెపంతో ‘సాక్షి’ రిపోర్టర్‌పై దాడికి యత్నించి సెల్‌ఫోన్ లాక్కున్నారు.
సత్తెనపల్లి టౌన్ సీఐ ప్రభాకర్, రాజుపాలెం ఎస్‌ఐ మణికృష్ణలు టీడీపీ నేతలకు ఊడిగం చేశారు. టీడీపీ నేతలను మెప్పించేందుకు అర్ధరాత్రి 12వ వార్డు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పెద్దింటి గోవిందమ్మ భర్త వెంకటేశ్వర్లును ప్రివెంటివ్ అరెస్టు పేరుతో అక్రమంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కనీసం ఓటు వేసేందుకు కూడా అనుమతించలేదు. మరోవైపు టీడీపీ గూండాలు గోవిందమ్మ కుమారుడు బీప్ చంద్‌ను ముసుగులో వచ్చి కిడ్నాప్ చేసినా పోలీసులు చోద్యం చూశారు. వైఎస్సార్ సీపీ నేత గార్లపాటి ప్రభాకర్‌పై టీడీపీ గూండాలు దాడి చేసి గాయపరచడంతో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. 15వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అడ్డుకోవాల్సిన టౌన్ సీఐ వారిని పోలింగ్ బూత్‌లోకి తానే పంపారు. అక్కడ ఉన్న వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ్‌రెడ్డిని మాత్రం హౌస్ అరెస్టు చేసి నిర్బంధించారు. ముప్పాళ్ల, సత్తెనపల్లి రూరల్ మండలాల్లో టీడీపీ గూండాలు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పలు వార్డుల్లో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీన్ని అరికట్టాల్సిన పోలీసులు దగ్గరుండి వారికి సహకరించారు.
శనివారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్ సీపీ నేతలు, అభ్యర్థుల కుటుంబ సభ్యులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. కనీసం ఓటు వేసేందుకు కూడా అనుమతించలేదు. పట్టణంలో 300 మంది పోలీసులు మోహరించి ఉన్నప్పటికీ, టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు. బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌లకు పాల్పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. అడ్డుకోబోయిన వైఎస్సార్ సీపీ నేతలను, ఓట్లు వేసేందుకు వెళుతున్న ఓటర్లను పోలీసులు వెనక్కి పంపించారు. ఓటర్ల నుంచి స్లిప్పులను లాక్కుని టీడీపీ ఏజెంట్లే ఓట్లు వేయడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు వచ్చారు. 36వ వార్డు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న రామ తులశమ్మ, 6వ వార్డు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అంజలిలను సైతం వారి ఓటు వారు వేసుకునేందుకు టీడీపీ నేతలు అనుమతించని పరిస్థితి నెలకొంది.
ఓటమి భయంతో టీడీపీ నేతలు తమ గూండాలను రెచ్చగొట్టారు. మహిళలపై సైతం దాడులకు తెగబడిన దుర్మార్గపు ఘటనలు ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి. గుంటూరు నగరంలోని 57వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నవారిని అడ్డుకున్నారనే కారణంతో ఏజెంట్ విజయ మేరీ చీర లాగి దాడి చేశారు. బ్యాలెట్ బాక్సును దూరంగా విసిరివేసి బీభత్సం సృష్టించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి శ్రీదేవిపై సైతం దాడికి తెగబడ్డారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ నేతలు ప్రవర్తించారని మహిళలు మండిపడుతున్నారు.
వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు అభ్యర్థిని పోలూరి అర్చనామూర్తిపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రధాన అనుచరుడు పి.వి.సురేష్‌బాబు పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోలీసుల ఎదుటే దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అయినప్పటికీ పోలీసులు చోద్యం చూశారు. ఆమె భర్త నరసింహమూర్తిపై సైతం దాడికి పచ్చ గూండాలు తెగబడ్డారు.
చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అన్నపురెడ్డి శ్రీలక్ష్మిపై టీడీపీ గూండాలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ, ఆమెను బూత్‌ల వద్దకు రానీయకుండా దాడి చేయడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాకుండా 13వ వార్డులో ఓట్లు వేసేందుకు వచ్చిన మహిళలపై టీడీపీ గూండాలు దాడి చేశారు. పోలింగ్ కేంద్రాల ఎదుట వారు ధర్నాకు దిగారు.
ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ గూండాలను మోహరింపజేశారు. పథకం ప్రకారం శనివారం అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును వినుకొండ నుంచి నరసరావుపేటలోని తన నివాసానికి తరలించి హౌస్ అరెస్టు చేశారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ సరళిని గమనించిన టీడీపీ నేతలు, ఇక ఓటమి తప్పదని భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పట్టణంలోని 5, 7, 8, 12, 19, 32 వార్డులతోపాటు మరికొన్ని పోలింగ్ బూత్‌లలో సైతం ఏజెంట్లను బయటకు లాగేసి, తలుపులు మూసి రిగ్గింగ్ చేశారు. పక్క గ్రామాల నుంచి పథకం ప్రకారం టీడీపీ గుండాలను పిలిపించి, వినుకొండ టౌన్ సీఐ ప్రభాకర్ దగ్గరుండి వైఎస్సార్ సీపీ శ్రేణులను పోలింగ్ కేంద్రాల నుంచి తరలించారు. టీడీపీ గూండాలను పోలింగ్ కేంద్రాల్లోకి పంపించి రిగ్గింగ్‌ను ప్రోత్సహించారు. పచ్చచొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నట్లుగా సీఐ వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ నేతలపై లాఠీచార్జి చేసి అధికార పార్టీపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. వినుకొండ పట్టణంలోని ఆరు వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.


