పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లి దొంగ ఓట్లు వేసిన టీడీపీ బ్యాచ్ ససీ కెమెరాలతో నిఘా పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోని ఎలక్షన్ కమిషన్ వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి, ఏజెంట్‌పై భౌతికదాడి సిగ్గు చేటు చంద్రబాబు, లోకేష్ అధికారం శాశ్వతం కాదు లోకేష్ ఆండతో రెచ్చిపోతున్న పోలీసులకు హెచ్చరిక వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమే.. అందరి లెక్కలు తేలుస్తాం అక్రమాలు జరిగిన డివిజన్లలో రీ–పోలింగ్ జరపాలి వైఎస్సార్ సీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ అక్రమాలకు తెరతీసి, రిగ్గింగ్‌కు పాల్పడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. ఆదివారం పోలింగ్ ముగిసిన తరువాత బృందావన్‌గార్డెన్స్‌రోడ్డులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు టీడీపీ నేతలు పోలీసుల సహకారంతో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అన్నారు. టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను పోలింగ్ కేంద్రాల్లోని సీసీ కెమెరాలు చూస్తే అర్ధమవుతాయన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో టీడీపీ దొంగ ఓట్లు వేయడాన్ని అడ్డుకున్నందుకు వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రేదేవితోపాటు పోలింగ్ ఏజెంట్ విజయమేరీపై టీడీపీ గూండాలు భౌతిక దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మహిళలపై భౌతికదాడి చేసిన సిగ్గులేని మృగాలని ఎన్ని తిట్టినా తప్పులేదన్నారు. సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ సహకారంతో టీడీపీ అభ్యర్థి కొమ్మినేని కోటేశ్వరరావు దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై తాము జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేశామని చెప్పారు. ఇద్దరు మహిళలపై దౌర్జన్యం చేయడం సిగ్గుచేటని, చంద్రబాబు, లోకేష్ శాశ్వతంగా అధికారంలో ఉండరని, టీడీపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలింగ్ బూత్‌లతో పాటు అన్ని రూమ్‌లలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టే చెప్పినా ఎన్నికల కమిషన్, జిల్లాల్లో అధికార యంత్రాంగం పట్టించుకోలేదన్నారు. 42వ వార్డు అభ్యర్థి తండ్రి ఆలా సాంబశివరావును అక్రమంగా అదుపులోకి తీసుకెళ్లిన పోలీసులు 12 గంటల అనంతరం విడిచిపెట్టారని, ఈ సంఘటనలో సీఐ ఆరోగ్యరాజు వైఖరి సరికాదన్నారు. బెయిల్ ఇచ్చే కేసులో అక్రమంగా తీసుకెళ్లి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం గిర్రున తిరుగుతుందని, అధికారంలో ఉన్నవారి అండ చూసుకుని చెలరేగిపోతున్న అందరిపై వైఎస్ జగన్ సీఎం కాగానే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో కూటమి ఫెయిల్
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ పార్లమెంటు పరిశీలకుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో కూటమి ఫెయిలైందని విమర్శించారు. టీడీపీ అభ్యర్థులు గెలవాలని పచ్చచొక్కాలు తొడుక్కున్న పోలీసులు ఏకపక్షంగా సహకరించారని అన్నారు. వైఎస్సార్ సీపీ తరపున తాము ఎన్నికల్లో శాంతియుతంగా వ్యవహరిస్తే, అధికారంలో ఉన్న టీడీపీ దొంగ ఓట్ల సంప్రదాయాన్ని కొనసాగించిందని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ అంతా అక్రమాల నిలయంగా మారిన నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో జరపాలని డిమాండ్ చేశారు. 57వ డివిజన్‌లో మేయర్ అభ్యర్థి శ్రీదేవితోపాటు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి టీడీపీ నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా సమర్ధవంతంగా పోరాటం చేశారని అన్నారు. టీడీపీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ అభ్యర్థుల పోరాట పటిమ ఎంతో గొప్పదని, మేం అధికారంలోకి ప్రతీకారం గట్టిగా ఉంటుందని హెచ్చరించారు.
మృగాల కంటే హీనమైన మనుషులు
మేయర్ అభ్యర్థి తాడికొండ అలివేలు నాగ వెంకట పద్మ శ్రీదేవి మాట్లాడుతూ 57వ డివిజన్‌లో జరిగిన అరాచకం సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉందని, తనపై దాడి చేసిప టీడీపీ గూండాలు మృగాళ్ల కంటే హీనమైన మనుషులని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడి చేసి, బ్యాలెట్ బాక్సులు తీసుకుని, దొంగ ఓట్లు వేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రేక్షకపాత్ర పోషించారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన టీడీపీ రౌడీ మూకలతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసభ్యకరంగా ప్రవర్తించారు
వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్ వజ్రాల విజయమేరీ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలోకి గుంపుగా వచ్చిన టీడీపీ మూకలు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారని, వారిని అడ్డుకున్నందుకు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని అన్నారు. టీడీపీ బ్యాచ్ మేయర్ తరపున దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారని, జరిగిన సంఘటనపై ఆర్వోకు, పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నల్లమోతు రూత్‌రాణి, పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.


