వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
గుంటూరు వెస్ట్: ఎన్నికల్లో గెలవడానికి మరీ ఇంతలా దిగజారిపోవడమెందుకని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆదివారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అంబటి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో తీవ్రమైన ఉల్లంఘనలతోపాటు అప్రజాస్వామిక చర్యలు జరిగాయన్నారు. ముఖ్యంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌న్‌లోని 45, 48, 54, 55, 56, 57 డివిజన్లలో తీవ్రమైన ఎన్నికల అక్రమాల కారణంగా సీసీ టీవీ ఫుటేజీని తక్షణమే పరిశీలించి రీ–పోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పైన తెలిపిన డివిజన్‌లలో పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, దొంగ ఓట్లు, ఓట్ల రీసైక్లింగ్, రిగ్గింగ్, ఓటర్లను బెదిరించడం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం వంటి అనేక అక్రమ కార్యకలాపాలపై తీవ్రమైన ఫిర్యాదులు అందాయన్నారు. కొంతమంది పోలీసు సిబ్బంది సహకారంతో ఇటువంటి సంఘటనలు జరిగాయని ఆరోపణలు రావడం మరింత ఆందోళనకలిగించిందన్నారు. ఆరు డివిజన్లలోని అన్ని పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీని వెంటనే భద్రపరిచి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ఎన్నికల అధికారుల నుంచి నివేదికలు తెప్పించాలన్నారు. ఎన్నికల అక్రమాలకు బాధ్యులైన అధికారులు, వ్యక్తులందరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తీవ్రమైన అక్రమాలు రుజువైన అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిబంధనల ప్రకారం రీ–పోలింగ్‌కు ఆదేశించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. పారదర్శకమైన ఎన్నికల వాతావారణాన్ని తాము కోరుకుంటున్నామని అంబటి వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


