గుంటూరు ఎడ్యుకేషన్: నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, నగరపాలకసంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ సందర్శించారు. ఎన్నికల తీరును పరిశీలించిన కలెక్టర్ అక్కడి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో మాట్లాడారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా హెల్ప్‌డెస్క్‌లు సహకారం అందించాలని ఆదేశించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, అనారోగ్యంతో ఉన్నవారికి తగు ప్రాధాన్యత ఇచ్చి ముందుగా ఓటు వేసే విధంగా సహకరించాలని కోరారు. దివ్యాంగులకు అవసరమైతే త్రిచక్ర వాహనాలుతో సహకారం అందించాలని సూచించారు.
పారిశుద్ధ్య కార్మికుడు దుర్మరణం
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజీపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. విజయవాడ నుంచి తాడేపల్లి వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మందడం టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్న పొట్లూరి సాంబశివరావు (40) వెంకటపాలెం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం విజయవాడ నుంచి తాడేపల్లి వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా, బ్యారేజీపైకి చేరుకున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సాంబశివరావుకు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉండగా, ఆ వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. రోజువారీ విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న సాంబశివరావు ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, పరిచయస్తుల్లో విషాదం నెలకొంది. బ్యారేజీపై వాహనాల రాకపోకలు అధికంగా ఉండే నేపథ్యంలో వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, అప్రమత్తంగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు.
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లకు పోల్ స్లిప్పుల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బూత్ లెవల్ అధికారులు(బీఎల్వోలు) ఏ ఎన్నికల్లో అయినా ఇంటింటికి వెళ్లి అందజేస్తుంటారు. ఈ ఎన్నికల్లో చాలాచోట్ల పంపిణీ చేయలేదు. దీంతో పలు డివిజన్లలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు మున్సిపల్ సిబ్బందికి ఓటరు కార్డు చూపించి స్లిప్పులు పొందారు. ఓటేసేందుకు ఇబ్బంది లేకున్నా పోలింగ్ స్లిప్పులు పొందడానికి ఓటర్లు వేచి చూడాల్సి వచ్చింది. టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులు పలువురు తమ ఫొటో, గర్తు, పేరుతో కూడిన పోలింగ్ స్లిప్పులను ఓటర్లకు అందజేశారు. తమకే ఓటు వేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సైతం అభ్యర్థుల ఫొటోలతో కూడిన పోల్ స్లిప్పులను తీసుకుని వెళ్లగా అధికారులు వాటిని తీసుకుని ఓటు వేయించారు. అంతేకాకుండా పలుచోట్ల పోలింగ్ స్లిప్పులు కవర్లలో వేసి రోడ్డుపై గుట్టలుగా పడేశారు.
కొరిటెపాడు(గుంటూరు): నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కవరేజికి వెళ్లిన మీడియాకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్ల ఫొటోలు తీయడానికి అనుమతి ఇవ్వలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల వెంట అనుచరులు, పీఏలు వెళ్లినా అడ్డుకోని పోలీసులు.. మీడియాను మాత్రం నిలిపివేయడం విస్మయానికి గురిచేసింది. పలు డివిజన్లలోని పోలింగ్ బూతుల్లో అనుమతించిన పోలీసులు ఇక్కడ ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా కేంద్రాల వద్ద వంద మీటర్ల అవతలే మీడియా ప్రతినిధులను నిలిపివేశారు. దీంతో పోలింగ్‌కు సంబంధించిన ఫొటోల కోసం మీడియా ప్రతినిధులు నానా ఇబ్బందులు పడ్డారు.


