జీఎంసీలో 56.15 శాతం పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

జీఎంసీలో 56.15 శాతం పోలింగ్‌

Nov 2 2026 2:23 AM | Updated on Nov 2 2026 2:23 AM

● మధ్యాహ్నం 3 గంటల

వరకు మందకొడిగా ఓటింగ్‌

● వసతులు లేక పోలింగ్‌

కేంద్రాల్లో ఓటర్లకు అవస్థలు

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) సాధారణ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, విపక్షాల ఆరోపణలు, చెదురుమదురు సంఘటనల మధ్య మొత్తంగా ముగిసింది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన ఓటింగ్‌ సరళి మధ్యాహ్నం 3 గంటల తర్వాత పుంజుకుంది.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 6,18,714 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 3,00,471 మంది, మహిళలు 3,18,164 మంది, ఇతరులు 79 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 3,47,438 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 56.15 శాతంగా పోలింగ్‌ నమోదైంది. జీఎంసీ పరిధిలో మొత్తం 76 వార్డులకు గాను ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ఆరంభంలో చాలా మందకొడిగా సాగింది. ఉదయం 9 గంటలకు 5.21, 11 గంటలకు 17.82, మధ్యాహ్నం ఒంటి గంటకు 30.94, 3 గంటలకు 40.99, సాయంత్రం 5కు 51.40గా పోలింగ్‌ శాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు.

క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు హక్కు కల్పించడంతో దాదాపు 50 వార్డుల్లో రాత్రి వరకు పోలింగ్‌ కొనసాగింది. రాత్రి 9 గంటలకు జీఎంసీ అధికారికంగా విడుదల చేసిన తుది నివేదిక ప్రకారం పోలింగ్‌ శాతం 56.15గా నమోదైంది. నగరంలో అత్యధికంగా 18వ డివిజన్‌లో 77.60, 51లో 77.10, 19లో 75.20 శాతం ఓటింగ్‌ జరిగింది. 44వ డివిజన్‌లో అత్యల్పంగా 43.11 శాతం నమోదైంది. 2019లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 57 వార్డులలో 60.80 శాతం పోలింగ్‌ జరిగింది. అప్పట్లో 16వ డివిజన్‌లో అత్యధికంగా 83.19 శాతం, అత్యల్పంగా 42వ డివిజన్‌లో 47.19 శాతం పోలింగ్‌ నమోదైంది.

వైఎస్సార్‌ సీపీ బీఎల్‌ఏలకు ఇబ్బందులు

పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదమైంది. వైఎస్సార్‌ సీపీకి చెందిన బీఎల్‌ఏలను బూత్‌లోకి అనుమతించకుండా ప్రిసైడింగ్‌ అధికారులు ఇబ్బందులకు గురిచేశారు. చీఫ్‌ ఏజెంట్లను సైతం వేధించిన సందర్భాలు ఉన్నాయి. కూటమి పార్టీలకు చెందిన వారిని మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించారు. రాత్రి సమయంలో అధికారులను అడ్డుపెట్టుకుని రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. బూత్‌లు చాలా వరకు ఇరుకుగా ఉండటంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.

హిందూ కళాశాలలో ఓటు వేస్తున్న మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మేయర్‌ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి, 75వ వార్డులో నూరి ఫాతిమా, సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement