హామీలు చెక్‌ చేసుకోండోమారు | - | Sakshi
Sakshi News home page

హామీలు చెక్‌ చేసుకోండోమారు

Nov 3 2026 1:57 AM | Updated on Nov 3 2026 1:57 AM

రెండున్నరేళ్లు గడిచినా నోరు మెదపని వైనం నమ్మి మెజారిటీనిచ్చి మోసపోయామని ప్రజల ఆవేదన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరిక

బుద్ధి చెప్పేందుకు సిద్ధం

కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్‌డ్యామ్‌ కడతామంటూ పవన్‌ కల్యాణ్‌ హామీ

డీసీఎం సారూ..

తెనాలి: ఎన్నికల్లో గెలుపుకోసం సూపర్‌ సిక్స్‌ హామీల తరహాలోనే కూటమి నేతలు నియోజకవర్గాల్లోనూ స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు వాగ్దానాలు గుప్పిచ్చారు. అందులో కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్‌డ్యామ్‌ నిర్మాణం ఒకటి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. నేతల మాటలు నమ్మిన మండల ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టినప్పటికీ కూటమి నాయకులు కీలకమైన ఆ హామీ ఊసే ఎత్తటం లేదు. నియోజకవర్గం నుంచి కేంద్రం, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇద్దరు మంత్రులున్నా చెక్‌డ్యామ్‌ గురించి మాట్లాడితే ఒట్టు...అన్నటు ఉన్నారు.

హామీ హుళక్కే..!

మండల కేంద్రం కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్‌ డ్యామ్‌ను నిర్మించి ఆ ప్రాంత వాసుల తాగు, సాగునీటి ఇక్కట్లను తీరుస్తామని జనసేన పార్టీ అధినేత వన్‌కళ్యాణ్‌ హామీనిచ్చారు. 2024 ఏప్రిల్‌ 14న తెనాలి మార్కెట్‌ సెంటర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో అప్పుడు గుంటూరు ఎంపీగా పోటీచేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌, తెనాలి ఎమ్మెల్యే బరిలో నిలిచిన నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో పవన్‌కళ్యాణ్‌ నియోజకవర్గ ప్రజలకు ఈ హామీనిచ్చారు. ఎన్నికల్లో గెలిపించిన వెంటనే చెక్‌డ్యామ్‌ నిర్మిస్తామని స్పష్టంగా చెప్పారు. పవన్‌కళ్యాణ్‌ ఇచ్చిన ఈ హామీని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో కొల్లిపర మండలంలోని గ్రామగ్రామానికీ తీసుకెళ్లారు. ఈ హామీని నమ్మిన కొల్లిపర మండల వాసులు కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చాక పవన్‌కళ్యాణ్‌ డెప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర సహాయమంత్రిగా, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి మొత్తంమీద రెండున్నర సంవత్సరాలైనా, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌కళ్యాణ్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కృష్ణానది వరదల్లో కలిసిపోయింది.

నది దాటేందుకు వ్యయప్రయాసలు

కృష్ణానదిని ఆనుకుని ఉన్న మండల కేంద్రం కొల్లిపరకు నీటి కష్టాలు వెన్నాడుతున్నాయి. భూగర్భజలాలు తగ్గిపోయి, నదికి వంద మీటర్ల దూరంలోని పంటపొలాలకూ నీరందటం లేదు. కొల్లిపర మండలంలో గత ఏప్రిల్‌/మే నెలల్లో 250 పైగా బోర్లు వేయించారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నీటి సంగతిలా ఉంటే నదీగర్భలోని లంక గ్రామాలకు వెళ్లటానికి రైతులు, రైతుకూలీలు నానా అవస్థలు పడుతుంటారు. ఎరువులను తీసుకెళ్లేందుకు, పంట ఉత్పత్తులను తరలించటానికి నదిలో నీరున్నప్పుడు పడవలపైనే ఆధారపడుతుంటారు. ఇతర సమయాల్లో నదీ మార్గంలో తాత్కాలిక రహదారిని రైతులు నిర్మించుకుని రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడివారు కృష్ణాజిల్లాకు వెళ్లాలంటే మూడు నీటి పాయలు దాటి వెళ్లాల్సి వస్తోంది. కృష్ణానదిలో నీరు నిండుగా ఉండి, పడవ ప్రయాణం సాధ్యం కానపుడు విజయవాడ మీదుగా 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది.

కొల్లిపర వద్ద కృష్ణాన దిపై చెక్‌డ్యామ్‌ను నిర్మిస్తే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. భూగర్భజలాలు పెరిగి సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తొలగిపోతాయి. పంట ఉత్పత్తుల రవాణాకు రైతులు, రైతుకూలీలకు సులువైన మార్గం ఏర్పడుతుంది. 5.5 కిలోమీటర్ల ప్రయాణంతోనే కృష్ణాజిల్లాకు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. దాదాపు 65 కిలోమీటర్ల ప్రయాణ భారం తగ్గిపోతుంది. ఇంతటి కీలకమైన అంశంపై తాను ఇచ్చిన హామీపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న పవన్‌కళ్యాణ్‌ పట్టించుకోవటం లేదు. ఆ హామీపై మెజారిటీని దక్కించుకున్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లు మాట్లాడటం లేదు. కొన్ని సూపర్‌సిక్స్‌ హామీల్లానే కొల్లిపర వద్ద చెక్‌డ్యామ్‌ నీటిపై రాసిన రాతలా కనిపంచటం లేదని ప్రజలు నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement