‘మురసు’ ముప్పును ఎదుర్కొంటాం | - | Sakshi
Sakshi News home page

‘మురసు’ ముప్పును ఎదుర్కొంటాం

Nov 3 2026 1:57 AM | Updated on Nov 3 2026 1:57 AM

‘మురసు’ ముప్పును ఎదుర్కొంటాం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 0863–2234014

తుఫాన్‌ ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నేడు పాఠశాలలకు సెలవు

కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 0863–2234014

గుంటూరు వెస్ట్‌: మురసు తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. తుఫాన్‌ ప్రభావంతో సోమవారం జిల్లాలో సుమారు 2.5 సెం.మీ, మంగళవారం 3.5 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు, ఈరోజు మధ్యాహ్నం నుంచి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో, రేపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తుఫాన్‌ కావలి, ఒంగోలు మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షపు నీటి నిల్వకు వీలుగా కాలువల డిశ్చార్జిని తగ్గించడంతో పాటు పూడికతీత పనులు పూర్తి చేశామన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, ప్రకాశం బ్యారేజ్‌ దిగువన ఉన్న తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దన్నారు.

పునరావాస కేంద్రాలు గుర్తించాం..

కలెక్టర్‌ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లోని 17 గ్రామాలను గుర్తించి 64 గ్రామీణ సహాయ పునరావాస కేంద్రాలను, పట్టణ ప్రాంతాల్లో 21 కాలనీలకు సంబంధించి 19 సహాయ కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి, క్లోరినేషన్‌ చేయడంతో పాటు విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడితే వినియోగించేందుకు జనరేటర్లు, డీజిల్‌, సిబ్బందిని సిద్ధంగా ఉంచామని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు మండల, ఆర్డీఓ స్థాయి కంట్రోల్‌ రూమ్‌లు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ లేదా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కె ఖాజావలి పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌: ‘మురసు‘ తుఫాన్‌ ప్రభావంతో పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందని, ఆ నీటిని కిందకు వదులుతారని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నందున మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల్లో గల కృష్ణా తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లంక గ్రామల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో 0863–2234014 ఫోన్‌ నంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ పనిచేస్తుందన్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య తలెత్తరాదన్నారు. తాగునీటి పథకాలు వద్ద జనరేటర్లు సిద్ధంగా పెట్టుకోవాలని ఆదేశించారు. చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర సరుకులు పూర్తిస్థాయిలో అందుబాటులో పెట్టాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. పునరావాస కేంద్రాల వద్ద ఆహార తయారీ కోసం ఏజెన్సీలను సిద్ధం చేసి తక్షణ ఆహార పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైరిస్క్‌లో ఉన్న గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలన్నారు. జేసీ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్‌ఓ ఎన్‌.ఎస్‌.కె.ఖాజావలి, అధికారులు పాల్గొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: మురసు తుపాను ప్రభావంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేసి, ఆదేశాలను పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అందుకు పాఠశాలల యాజమాన్యాలే కారకులవుతారని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement