శంకర్‌విలాస్‌ వంతెనకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

శంకర్‌విలాస్‌ వంతెనకు గ్రహణం

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

శంకర్‌విలాస్‌ వంతెనకు గ్రహణం

ప్రణాళిక, భూ సేకరణ నోటిఫికేషన్‌ లేకుండా ఏకపక్షంగా కూల్చివేత దుకాణాలను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన వ్యాపారులు వ్యాపారులు, నిర్వాసితుల అభ్యంతరాలను పట్టించుకోని ప్రభుత్వం ఏడాదిన్నరగా ట్రాఫిక్‌ సమస్యలతో నరకాన్ని చవిచూస్తున్న నగర ప్రజలు

మెగా ఫ్లయ్‌ ఓవర్‌ మాటేంటి?

అంతా కపట ప్రేమే

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి కనుమరుగై ఏడాదిన్నర గడుస్తోంది. ఏడు దశాబ్దాలపాటు ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషించిన చారిత్రక శంకర్‌ విలాస్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి విషయంలో విజన్‌ లేని కూటమి సర్కారు చర్యలతో ప్రజలకు సమస్యలు తప్పడం లేదు. పెరుగుతున్న నగర వాసుల రవాణా అవసరాలకు అనుగుణంగా శంకర్‌విలాస్‌ ఆర్వోబీ స్థానంలో నాలుగు లైన్లతో నూతన ఆర్వోబీని నిర్మించాలని ప్రతిపాదించిన కూటమి ప్రభుత్వం.. గతేడాది ఆగస్టులో బ్రిడ్జ్‌ను కూల్చివేసింది. అనంతరం నూతన బ్రిడ్జ్‌ నిర్మాణ పనుల్లో భాగంగా అరండల్‌పేట, బ్రాడీపేటను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్లను క్రమంగా మూసివేసి, పిల్లర్ల నిర్మాణాలను చేపట్టారు. రెండు వైపులా పిల్లర్ల నిర్మాణాలు చేపట్టడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలకు సైతం ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందు చూపు లేని పాలకుల చర్యలతో 70 ఏళ్ల పాటు సేవలందించిన మహా నిర్మాణం చరిత్రగా మిగిలిపోయింది. నాలుగు లేన్లతో కూడిన బ్రిడ్జి నిర్మిస్తామని పనులు చేపట్టిన ప్రభుత్వం దానిని వచ్చే ఏడాది జూలై నాటికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. కాగా నష్ట పరిహారం ఇవ్వకుండా, వ్యాపారులను భయపెట్టి నిర్బంధంగా కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులపై రేట్‌ పేయర్స్‌ అసోసియేషన్లు, వ్యాపార వర్గాలు, నిర్వాసితులు, ఆటో కార్మికులు, దుకాణాల్లో ఉపాధి కోల్పోయిన కార్మికులు కుటుంబాలు కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వ్యతిరేకంగా ఉన్నాయి.

కళ కోల్పోయిన కూడలి

గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న శంకర్‌విలాస్‌ బ్రిడ్జి ముఖ్యమైన కూడలితో పాటు 10 లక్షలకుపైగా జనాభా ఉన్న గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతం. విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారుల నిత్య జీవితంలో అంతర్భాగం. నిత్యం వేల మంది ప్రజల రాకపోకలతో సందడిగా ఉండే ఆ ప్రాంతం ఏడాదిన్నరగా కళను కోల్పోయింది. బ్రిడ్జ్‌ నిర్మాణ పనుల కారణంగా చేపట్టిన విస్తరణలో రెండు వైపులా దుకాణాలను కూల్చి వేయడంతో వ్యాపారులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. సొంత దుకాణాలు ఉన్న వ్యాపారులు మిగిలిన స్థలంలో దుకాణాలను నిర్మించుకోగా, అద్దెకు ఉంటున్న వ్యాపారులు అక్కడి నుంచి తరలారు. కార్మికులు పొట్ట చేత్తో పట్టుకుని వెళ్లిపోయారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లయ్‌ ఓవర్‌ నిర్మించాలని వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు చేసిన విజ్ఞప్తులను కూటమి సర్కారు బుట్టదాఖలు చేసింది. వందేళ్ల ట్రాఫిక్‌, ప్రజా అవసరాలకు అనుగుణంగా మెగా ఫ్లయ్‌ ఓవర్‌ నిర్మించాలని చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లింది. గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఏకపక్ష చర్యలతో నగర ప్రజలు మెగా ఫ్లయ్‌ ఓవర్‌ ప్రాజెక్టును కోల్పోయారు. గతంలో రూ.167 కోట్లతో 1.4 కిలోమీటర్ల పొడువుతో ప్రతిపాదించిన మెగా ఫ్లయ్‌ ఓవర్‌ స్థానంలో రూ.98 కోట్ల సేతు బంధన్‌ ప్రాజెక్టు ద్వారా 930 మీటర్లకు కుదించిన నాలుగు లేన్ల సాధారణ బ్రిడ్జ్‌గా మారిపోయింది. మెగా ఫ్లయ్‌ ఓవర్‌ ప్రాజెక్టులో రెండు వైపులా ఆర్‌యూబీలు ఉన్నాయి. సింగల్‌ పిల్లర్‌తో ఫ్లయ్‌ ఓవర్‌ నిర్మించడం ద్వారా ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు, వాహనాల పార్కింగ్‌ సమస్య, సర్వీసు రోడ్డు సమస్యలు తలెత్తేవి కావు. గుంటూరుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన రూ.98 కోట్లతో రాజీపడి నిర్మిస్తున్న ఆర్వోబీ కారణంగా భవనాలు కోల్పోతున్న వ్యాపారస్తులు, యజమానులకు రూ.40 కోట్ల మేరకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చిందని, ఆ మొత్తాన్ని కలుపుకొంటే మెగా ఫ్లయ్‌ ఓవర్‌ నిర్మించవచ్చునని బెటర్‌ శంకర్‌ విలాస్‌ ఫ్లయ్‌ ఓవర్‌ జేఏసీ ప్రతినిధులు, వ్యాపార వర్గాలు మొత్తుకున్నారు. అయినప్పటికీ పాలకులు, అధికారులు ఖాతరు చేయలేదు.

బ్రిడ్జ్‌ నిర్మాణం కారణంగా భవనాలు కోల్పోయిన యజమానులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు ఆర్‌యూబీ నిర్మిస్తామని మాట తప్పిన అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. ఏకపక్ష చర్యలపై హైకోర్టు పలుమార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అయినా తమకు పట్టదన్నట్లుగా ఏకపక్షంగా పనులు చేసుకుంటూ పోతున్నారు. సరైన ప్రణాళిక, భూ సేకరణకు నోటిఫికేషన్‌ లేకుండా ఏకపక్షంగా కూల్చివేత, నిర్మాణ పనులు చేపట్టారు. నగర ప్రజలు ఏడాదిన్నగా ట్రాఫిక్‌ సమస్యలతో నరకాన్ని చవిచూస్తున్నారు. రాజధాని చెంతనే ఉన్నా గుంటూరు నగరంలో మెగా ఫ్లయ్‌ ఓవర్‌ నిర్మాణానికి చంద్రబాబు సర్కారు పైసా నిధులు కేటాయించకపోవడం దారుణమని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement