కూటమి ధనవంతులతో పోటీ పడుతున్న సామాన్యురాలు శ్రీదేవి మేయర్‌గా ఆర్యవైశ్య మహిళను గెలిపించుకుందాం గుంటూరు నగరాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తాం మేయర్ అభ్యర్థి శ్రీదేవితో కలిసి వైఎస్సార్ సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, మోదుగుల, నూరి ఫాతిమా హామీ
అఖండ విజయం అందించండి
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగర సమగ్రాభివృద్ధి కోసం రాజకీయ అలజడులు, వర్గ విభేదాలు లేని స్వచ్ఛమైన పాలన అందించేందుకు నవంబర్ ఒకటో తేదీన జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి విజయం చేకూర్చాలని ఆ పార్టీ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడారు.
విజయంతో సరికొత్త పాలనకు నాంది
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ విజయంతో నగరంలో సరికొత్త పాలనకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రతి డివిజన్‌లో ప్రజలు వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, ఇదే ఉత్సాహాన్ని నవంబర్ ఒకటో తేదీన జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లలో చూపించాలని కోరారు. గుంటూరు రూపురేఖలు మార్చేందుకు వైఎస్సార్ సీపీని గెలిపించాలని అన్నారు.
కూటమికి ఓటు అడిగే హక్కు లేదు
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. గుంటూరులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం గతంలో కేంద్రం ఇచ్చిన రూ. వెయ్యి కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కూటమికి ఓటు అడిగే హక్కు లేదని, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎంలు ఉంటే కూటమి నేతలు రిగ్గింగ్ చేసి, మాయ చేసి గెలిచేవారని ఆరోపించారు. తాను ఎంపీగా ఉండి ఉంటే శంకర్ విలాస్‌ను మెగా ఫ్లయ్‌ఓవర్‌గా నిర్మించేవాడినని, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు ముందు చూపు లేకపోవడంతో అది సాధారణ బ్రిడ్జిగా మిగిలిపోతోందని అన్నారు. ఆయనకు ఆరాటం, ఆర్భాటం ఎక్కువని, ఆలోచన తక్కువని విమర్శించారు. ప్రజలకు సుపరిపాలన అందించిన తెల్లాకుల జాలయ్య వంటి పాలకుడిని, అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు వారసురాలిగా బరిలో నిలిచిన తాడికొండ శ్రీదేవిని గెలిపించాలని కోరారు.
కూటమి పాలనలో వైఫల్యాలు
షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ.. తాడికొండ శ్రీదేవికి మేయర్ సీటు ఇవ్వడం ఆర్యవైశ్య సమాజానికి ఇచ్చిన గౌరవంగా భావించాలన్నారు. కూటమి పాలనా వైఫల్యాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారని అన్నారు. కూటమి పాలనను చూసిన ప్రజలు మరోసారి అదే తప్పు చేయరాదని, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓటు వేసి కూటమికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
గుంటూరు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా
మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులను గుర్తించిన వైఎస్సార్ సీపీ నేతలు గృహిణిగా ఉన్న తనను మేయర్ అభ్యర్థిగా పోటీలో నిలిపి, వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. తనకు సీటు ఇచ్చిన వైఎస్ జగన్ రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. ప్రచారంలో వెళ్లిన ప్రతి గడపలోనూ ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెబుతున్నారని అన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనతోపాటు కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, పలువురు కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. 76 డివిజన్లలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు మేయర్ అభ్యర్థి తాడికొండ అలివేలు వెంకట నాగ పద్మ శ్రీదేవికి అఖండ విజయం అందించాలని కోరారు. గుంటూరు మేయర్ పీఠం మహిళలకు రిజర్వ్ కావడంతో, వైఎస్సార్ సీపీ తరఫున ఆర్యవైశ్య కుటుంబానికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారని చెప్పారు. గతంలో పాదర్తి రమేష్ గాంధీకి మేయర్‌గా అవకాశం ఇవ్వాలని భావించామని, ఆయన మరణంతో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీని తాజాగా శ్రీదేవి ద్వారా ఆచరణలోకి తెచ్చామని అన్నారు. ఆస్తిపాస్తులు లేని సామాన్య కుటుంబానికి చెందిన గృహిణి, దైవభక్తి మెండుగా ఉండి, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆర్యవైశ్య మహిళ తాడికొండ శ్రీదేవిని మేయర్ అభ్యర్థిగా పార్టీ తరఫున ఎంపిక చేశామని చెప్పారు. కూటమి ధనవంతులతో పోటీ పడుతున్న అతి సామాన్యురాలు శ్రీదేవిని మేయర్‌గా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్పొరేషన్‌లో విజయం సాధించడం ద్వారా నగరంలో రాజకీయాలకు తావులేని పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు ఇస్తే తీసుకుని, ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయాలని విజ్ఞప్తి చేశారు. శాంతికాముకులైన ఆర్యవైశ్యులతో గుంటూరులో అలజడికి తావుండదని, నగరాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆర్యవైశ్యులు బాధ్యత తీసుకుని శ్రీదేవిని గెలిపించాలని కోరారు. శ్రీదేవికి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసి తిరిగి సంపాదించాలనే ఆలోచన లేదని, బీసీ మహిళను కోడలిగా చేసుకున్న కుటుంబం వారిదని అన్నారు.


