ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి మున్సిపాలిటీలకు నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రశాంతమైన ఓటింగ్‌కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏమైనా ఇబ్బందులను సృష్టించేందుకు ఎవ్వరు ప్రయత్నించినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. జీఎంసీ పరిధిలో 596 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 4,514 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 185 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 1,185 మంది సిబ్బందిని కేటాయించామన్నారు. రెండు ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అక్టోబర్ 31న ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గుంటూరులో 76 వార్డులు, తెనాలిలో 52 వార్డులు కలిపి మొత్తం 128 వార్డులు ఉండగా, తెనాలిలో ఒక వార్డు ఏకగ్రీవమైనందున మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు.
7.75 లక్షల మందికి పైగా ఓటర్లు
కలెక్టర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో 6,18,714 మంది, తెనాలి మున్సిపాలిటీలో 1,57,089 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ గుంటూరులో 70 శాతం, తెనాలిలో 87 శాతం పూర్తయిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు ఎన్నికల కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెనాలి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కోసం వీఎస్‌ఆర్ కళాశాలలో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు శుక్ర, శనివారాల్లో అన్ని మండలాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
పటిష్ట భద్రతా చర్యలు
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల భద్రత కోసం సుమారు 1,200 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమిస్తున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గుంటూరు, తెనాలి ప్రజలందరూ ఎన్నికల్లో చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజావలి పాల్గొన్నారు.


