తీర్థగోష్టిని అనుగ్రహించిన జీయర్‌స్వామి | - | Sakshi
Sakshi News home page

తీర్థగోష్టిని అనుగ్రహించిన జీయర్‌స్వామి

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

తీర్థగోష్టిని అనుగ్రహించిన జీయర్‌స్వామి ఆరో బెటాలియన్‌లో కొవ్వొత్తుల ర్యాలీ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల దుర్గమ్మకు కానుకగా బంగారు హారం

తాడేపల్లి రూరల్‌: త్రిదండి చిన్న జీయర్‌ స్వామి వారు శుక్రవారం తాడేపల్లి పట్టణం, సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో భక్తులకు దివ్యమైన తీర్థగోష్టిని అనుగ్రహించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి వారు విజయకీలాద్రి దివ్యక్షేత్రానికి విచ్చేసి భక్తులకు తీర్థ గోష్టిని అన్రుగహించారని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా కార్యక్రమాల్లో తమవంతు సేవలను అందిస్తూ విశేష కైంకర్యం చేసిన రావ్‌ఫిన్‌ సత్యవతి పరమపదోత్సవ కార్యక్రమం నిర్వహించామన్నారు. చిన్న జీయర్‌స్వామి వారు భక్తులందరికీ మంగళాశాసనాలు అందించారని తెలిపారు.

మంగళగిరి టౌన్‌: దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలనే త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌లో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 21న నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొనసాగుతున్న అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌ ఎ.మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బెటాలియన్‌ అధికారులు, సిబ్బంది కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీలో పాల్గొని అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అంకితభావం, నిబద్ధత ప్రతి పోలీసు సిబ్బందికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని గుర్తుచేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ డి.ఆశీర్వాదం, అసిస్టెంట్‌ కమాండెంట్లు, బెటాలియన్‌ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ పరిధిలో మార్చి 2026లో నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఎ వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేశారు. బీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌ మొదటి సెమిస్టర్‌కు 61 మంది హాజరు కాగా 55 మంది, బీబీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌ పరీక్షకు 31 మంది హాజరు కాగా 22 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అభ్యర్థులు రీవాల్యుయేషన్‌కు నవంబరు 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు ఫీజు రూ.1060గా నిర్ణయించినట్లు తెలిపారు. వ్యక్తిగత వెరిఫికేషన్‌కు రూ.2190 చెల్లించాలని తెలిపారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన కె.జగన్మోహనరెడ్డి కుమార్తె కె.శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ.14 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. ఆలయ అధికారులను కలిసి సుమారు వందగ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఉపప్రధానార్చకులు బి. శంకరశాండిల్య అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement