స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం
● నా ఇంటిపై దాడి చేసిన
వారి అరెస్టు కోరుతూ నాడు ధర్నా
● అనుమతి లేకుండా ధర్నా
చేశానంటూ నాపైనే కేసు
● వినతి పాదయాత్ర చేస్తానని
చెప్పాను.. కచ్చితంగా చేస్తా
● స్థానిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ
వారిపైనా టీడీపీ నేతల దాడులు
● నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద
విలేకరులతో అంబటి రాంబాబు
లక్ష్మీపురం: తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద చేసిన ధర్నాకు సంబంధించి, అనుమతి లేకుండా ధర్నా చేశానంటూ నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలిపారు. కక్షపూరితంగానే తనపై అడ్డగోలు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ధర్నా కేసుకు సంబంధించి ఆధార్ కార్డును స్వయంగా అందజేసేందుకు వచ్చినట్లు వివరించారు. ఈ మేరకు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో గురువారం సీఐ రాజేష్‌కు ఆధార్ కార్డు అందజేశారు. అనంతరం స్టేషన్ బయట విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనపై క్రైమ్ నంబర్ 137/2026తో కేసు నమోదు చేసి 14 రోజుల క్రితం నోటీసు అందజేశారని తెలిపారు. ఆ నోటీసులో 14 రోజులలోపు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు హాజరై గుర్తింపు కార్డు అందజేయాలని కోరారని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారని చెప్పారు. అందుకే ఆధార్ అందజేసినట్లు తెలిపారు. తన ఇంటిపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసి, కుటుంబంపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష చేసినట్లు గుర్తుచేశారు. ముందుగా అనుమతి కోరగా, అధికారులు నిరాకరించారని తెలిపారు. తన ఇంటి నుంచి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నప్పటికీ, మధ్యలో గుండె సంబంధిత సమస్య రావడంతో పాదయాత్రను వాయిదా వేసినట్లు తెలిపారు. కచ్చితంగా పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదు చేశారో కూడా తెలియడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దమనకాండపై పోరాడుతానని చెప్పారు.
జనసేన, బీజేపీ నేతలపై టీడీపీ వారి దాడులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. అధికారులు, పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను చింపివేయడం, కార్లను తగులబెట్టడం వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కూటమిలోని బీజేపీ, జనసేన నాయకులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులు అధికారం కోసం మట్టి, ఇసుక అమ్ముకోవడానికి, డబ్బులు వసూలు చేసుకోవడానికి ఈ స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు. ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పడం తథ్యమని అన్నారు.
చంద్రబాబుకు అదే పని...
చంద్రబాబు మైక్ ముందుకు వచ్చి షర్మిలకు అన్యాయం చేశారని చెబుతున్నారని అంబటి గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు కుటుంబంలో సమస్యలు లేవా, విభేదాలు లేవా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు కుటుంబ విభేదాల గురించి మాట్లాడే నైతికత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీలపై దృష్టి పెట్టకుండా, హింసాత్మక ఘటనలు సృష్టిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు.
2024 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ తన సత్తా చూపిస్తుందని అంబటి అన్నారు. టీడీపీ నాయకులు అక్రమాలు, అన్యాయాలు, బెదిరింపులకు పాల్పడుతూ, హౌస్ అరెస్టులు చేయిస్తూ, నామినేషన్ పత్రాలను సైతం చింపివేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


