మారు వేషంలో పోలీసులమంటూ బెదిరింపులు రూ.15 లక్షలు అపహరణ నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చినకాకాని సమీపంలో నిందితుల పట్టివేత వివరాలు వెల్లడించిన నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు
మంగళగిరి టౌన్ : మంగళగిరి మండలం కాజా టోల్‌గేట్ సమీపంలో రూ.15 లక్షల నగదు దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నగదు తరలింపు విషయాన్ని ముందుగానే తెలుసుకున్న బాధితుడి డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి పథకం రచించాడు. మఫ్టీలో ఉన్న పోలీసులమంటూ అకౌంటెంట్‌ను బెదిరించి నగదు అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుంచి రూ.15 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు, నేరానికి ఉపయోగించిన నలుపు రంగు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ కె. వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలు వెల్లడించారు.
డ్రైవర్ నుంచే నగదు సమాచారం...
గుంటూరు నగరంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్ అన్వర్ ఆరెంజ్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. అదే సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న రఫీఉల్లా యజమాని సూచన మేరకు ఈ నెల 26న రూ.15 లక్షలను నల్ల బ్యాగులో పెట్టి తన స్కూటీ డిక్కీలో ఉంచుకుని కాజా టోల్‌గేట్ వద్దకు వచ్చాడు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న అన్వర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ జానీ తన స్నేహితులైన షేక్ సూరజ్, షేక్ నాగూర్‌బాషాలతో కలిసి నగదు కాజేయాలని నిర్ణయించుకున్నాడు.
ఎన్నికల కోడ్ పేరుతో బెదిరింపులు....
పథకంలో భాగంగా సూరజ్, నాగూర్‌బాషాలు మఫ్టీలో వచ్చి తాము పోలీసులమని రఫీఉల్లాను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నావంటూ బెదిరించి ఘర్షణకు దిగారు. అతని వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను లాక్కొని నగదును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రఫీఉల్లా స్కూటీని అడ్డగించి మరోసారి భయభ్రాంతులకు గురిచేశారు.
డిక్కీ పగులగొట్టి నగదుతో పరార్...
డ్రైవర్ జానీ సూచనల మేరకు మిగిలిన ఇద్దరూ మరోసారి రఫీఉల్లాను అడ్డుకుని దాడికి దిగారు. అతని చొక్కా చించి, చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో జానీ బాధితుడి దృష్టిని మరల్చగా, సూరజ్, నాగూర్ భాషలు స్కూటీ డిక్కీని బలవంతంగా పగులగొట్టి అందులోని రూ.15 లక్షల నగదుతో కూడిన నల్ల బ్యాగును తీసుకుని విజయవాడ వైపు పారిపోయారు.
చినకాకాని వద్ద పట్టివేత....
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం చినకాకాని గ్రామంలోని రాజ్‌కమల్ రోడ్డు సమీపంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో షేక్ జానీ, షేక్ సూరజ్, షేక్ నాగూర్ భాషలు ఉన్నారు. వారి నుంచి రూ.15 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు, నేరానికి వినియోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్, ఎస్‌ఐలు రవితేజ, నవీన్ నాయక్, ఏఎస్‌ఐ రత్నరాజు, హెడ్ కానిస్టేబుళ్లు రాము, చలమారావు, శ్యామ్, హోంగార్డు వీరయ్య పాల్గొన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు.


