తెనాలి సమగ్ర అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

తెనాలి సమగ్ర అభివృద్ధికి కృషి

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

తెనాలి: ‘పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎలాంటి వివక్షకు తావు లేకుండా అవసరమైన అభివృద్ధి పనులను చేస్తాం. అవినీతికి ఆస్కారం లేని పరిపాలన అందిస్తాం. పట్టణ ప్రజల సూచనల ప్రకారం పారిశుద్ధ్యం, దోమల నిర్మూలనకు ప్రాధాన్యం ఇస్తా. వ్యాపార వర్గానికి చెందినందున వారి సమస్యల పరిష్కారానికీ కృషి చేస్తా’ అని తెనాలి మున్సిపాలిటీ వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి మద్దాళి శేషాచలం అన్నారు. తెనాలిలో గత పాతికేళ్లకుపైగా వ్యాపార రంగంలో కొనసాగుతూ, పదేళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తనకు అటు ప్రజల అవసరాలు, సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తన ప్రచార సరళి, గెలుపునకు సానుకూలతలను వివరించారు. సౌకర్యాల కల్పనకు, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ‘సాక్షి’తో చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నా. ఉదయం వివిధ వార్డుల్లో పర్యటిస్తూ వివిధ వర్గాలను స్వయంగా కలుసుకుంటున్నా. సాయంత్రం నుంచి అయిదారు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌, ఆయా వార్డు సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నాం. ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా మద్దతు మీకేనని చిరునవ్వుతో చెబుతున్నారు. ‘విజయం మీదే’నంటూ భరోసా ఇస్తున్నారు. వైఎస్సార్‌ సీపీలో అంతా కలిసి వస్తున్నారు. వ్యాపారుల ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా వారి సమస్యలు పరిష్కరిస్తానన్న ఆశాభావంతో వారు ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగటం, సూపర్‌సిక్స్‌ హామీల అమలులో వైఫల్యం, సామాజిక పింఛన్లను గత రెండేళ్లుగా అర్హులైన ఏ ఒక్కరికీ ఇవ్వకపోవటం, ఎన్నికల ముందు దరఖాస్తులు తీసుకుని ఇవ్వకపోవటం... ఇవన్నీ నా గెలుపునకు సానుకూల అంశాలుగా భావిస్తున్నా.

సమస్యల పరిష్కారంపై దృష్టి

వార్డుల ప్రచారంలో ఎక్కువమంది పారిశుద్ధ్యం, డ్రైనేజీ, దోమల సమస్యలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. నేను గెలిస్తే ఆయా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తాను. వర్షాకాలంలో నీరు నిలిచే పల్లపు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేసి, శాశ్వత పరిష్కారం చూపుతా. మున్సిపల్‌, ప్రభుత్వ నిధులతో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తా. అభివృద్ధి పనుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతకు ప్రయత్నిస్తా. మురికివాడల్లో సమస్యలు, మౌలిక వసతులపైనా దృష్టి పెడతా. నూతన మున్సిపల్‌ భవన నిర్మాణం సజావుగా పూర్తిచేసేలా చూస్తా.’’

● పారదర్శక పాలన అందిస్తా

● పారిశుద్ధ్యం మెరుగు,

దోమల నివారణకు ప్రాధాన్యం

● అభివృద్ధి పనుల్లో అవినీతికి

తావు లేకుండా చూస్తా

● వ్యాపార వర్గాల సమస్యల

పరిష్కారానికి చర్యలు

● తెనాలి మున్సిపల్‌ వైఎస్సార్‌ సీసీ

చైర్మన్‌ అభ్యర్థి మద్దాళి శేషాచలం

ప్రచారంలో విశేష స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement