‘సరసిజ’ నాటక సంస్థను అమెరికాలోనూ ప్రారంభించారు. విజయా వారి ‘మిస్సమ్మ’ సినిమాను తల్లి విజయలక్ష్మితో నాటకంగా రాయించి అమెరికాలో ప్రదర్శించారు. అందులో సావిత్రి పాత్రలో నటించారు. సినిమాను నాటకంగా రంగస్థలంపై ప్రదర్శించడం ప్రపంచంలోనే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ నాటకాన్ని టీవీలోనూ ప్రసారం చేశారు. అలాగే, తల్లి రాసిన ‘ద్రౌపది అంతఃసంఘర్షణ’ నాటకంలో ద్రౌపదిగా నటించారు. ‘అనగనగా ఒక రాజకుమారి’, ‘పురూరవ’ నాటకాలను కూడా ప్రదర్శించారు. న్యూయార్క్లో జరిగిన ‘ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్’లో తెలుగు నాటకాన్ని ప్రదర్శించారు. 2022లో హైదరాబాద్లోని సారస్వత పరిషత్లో ‘లేఖిని–వంశీ’ ఆధ్వర్యంలో ‘సురభి జమునారాయలు–వంశీ రంగస్థల పురస్కారం’, ‘లేఖిని ఆత్మీయ పురస్కారం’ అందుకున్నారు. ఇలా విజయవంతంగా ముందుకు సాగుతూ తల్లికి తగిన తనయ అనిపించుకున్నారు.


