కన్నీరుమున్నీరైన బాధిత కుటుంబసభ్యులు మరో ముగ్గురిని రక్షించిన పశువుల కాపరి
తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ ప్రాతూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు ఈత కోసం గ్రామంలోని కృష్ణానదికి వెళ్లారు. అక్కడ ఐదు పడవలకు ఆయిల్ ఇంజిన్లు బిగించి ఉండడంతో ఒక పడవ ఇంజిన్ స్టార్ట్ చేసి కృష్ణానదిలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయి ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటన శనివారం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా ఈతకు వెళుతూ పడవలో ఇలా చక్కర్లు కొడుతున్నారు. శనివారం ఇంజిన్ ఆగిపోవడంతో ముందుగా డోలా అర్జున్ (17) ఈత రాకపోయినా పడవను పట్టుకుని నీటిలోకి దిగాడు. అతడు మునిగిపోతుండడంతో సీహెచ్ హరీష్ (18) కూడా నీటిలోకి దిగాడు. ఇద్దరూ మునిగిపోతుండగా పడవపై ఉన్న మరో ముగ్గురు పెద్దగా కేకలు వేయడంతో పశువులు మేపుతున్న మరో వ్యక్తి పడవ వేసుకుని వెళ్లి పైన ముగ్గురిని ఒడ్డుకు చేర్చాడు. తాడేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సుమారు 3 గంటల పాటు కృష్ణానదిలో గజ ఈతగాళ్లతో గాలించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీయించారు.
కన్నీరుమున్నీరు...
ప్రాతూరుకు చెందిన సీహెచ్ హరీష్ ఇంటర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు చిన్న వయసులోనే మృతి చెందడంతో హరీష్, అతని తమ్ముడు అనారోగ్యంతో ఉన్న నాయనమ్మ వద్ద ఉంటున్నారు. మేనత్త ఏసమ్మ వారి బాగోగులు చూస్తున్నారు. హరీష్ మృతదేహాన్ని చూసిన ఏసమ్మ బోరున విలపించారు. డోలా అర్జున్ పదవ తరగతి చదివి తల్లి కల్పనకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. తరచూ ‘తమ్ముళ్లిద్దరినీ బాగా చదివిద్దాం, నేను కూడా పనికి వెళతాను’ అంటూ ఆమెకు ధైర్యం చెప్పేవాడు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిని ఎవ్వరూ ఓదార్చలేకపోతున్నారు. విషయం తెలిసి గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. సుమారు 10 పడవల వరకు కృష్ణానది ఒడ్డున ఉంచుతున్నారని, వాటిని ఇతరులు నడపడానికి వీలులేకుండా చూడాలని స్థానికులు కోరారు.


