ప్రతిపక్షంపై తిరస్కరణ కుట్ర | - | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షంపై తిరస్కరణ కుట్ర

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

ప్రతిపక్షంపై తిరస్కరణ కుట్ర ● నారాకోడూరు 1, 2 సెగ్మెంట్లు: ఇక్కడ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, డమ్మీ అభ్యర్థుల నామినేషన్లను పూర్తిగా తిరస్కరించడంతో కేవలం టీడీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. దీంతో ఆ స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ దొడ్డిదారిన మార్గం సుగమం చేసుకుంది. ● వేజెండ్ల 1వ సెగ్మెంట్‌: అభ్యర్థి, డమ్మీ అభ్యర్థి నామినేషన్లు రెండూ రద్దయ్యాయి. వైఎస్సార్‌ సీపీకి మంచి పట్టు ఉన్న సెగ్మెంట్‌లో టీడీపీ అక్రమంగా ఏకగ్రీవానికి ప్రయత్నిస్తోంది. ● శేకూరు–1 సెగ్మెంట్‌: ఇక్కడ కూడా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి, డమ్మీ అభ్యర్థి నామినేషన్లు తిరస్కరణకు గురవటంతో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యేలా పచ్చ నేతలు ప్రణాళిక వేశారు.

ఈ సెగ్మెంట్లలోనే తిరస్కరణ...

19 మంది వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ఎంపీటీసీ నామినేషన్లు రద్దు చేబ్రోలు మండలంలో ఏకపక్షంగా తిరస్కరించిన యంత్రాంగం టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణమంటూ వైఎస్సార్‌ సీపీ శ్రేణుల ఆగ్రహం ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ నాయకుల అడ్డదారులు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో టీడీపీ నాయకులు, అధికారుల కుమ్మక్కుతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. చేబ్రోలు మండలంలోని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, ప్రత్యక్షంగా ఎన్నికలలో గెలువలేమని భావించిన పచ్చ నేతలు అక్రమాలకు తెరలేపారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఏకపక్షంగా ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.

చేబ్రోలు: మండలంలోని 13 గ్రామాల పరిధిలో 21 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మూడు రోజుల పాటు అన్ని పార్టీల తరఫున మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, శనివారం జరిగిన పరిశీలనలో ఏకంగా 19 నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి కోమలి పద్మ ప్రకటించారు. ఇలా తిరస్కరణకు గురైన మొత్తం నామినేషన్లు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులవే కావడం గమనార్హం. దీనిపై మండల వ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.

పక్కా ప్రణాళికతో తొలగింపు

శుక్రవారం సాయంత్రం ముగిసిన నామినేషన్ల వివరాలు, శనివారం ఉదయం పరిశీలన ప్రారంభమయ్యే లోపు రహస్యంగా టీడీపీ నాయకుల చేతికి నామినేషన్లలోని సమాచారం వెళ్లిందని తెలిసింది. మండల పరిషత్‌ కార్యాలయంలోని కీలక అధికారి ఒకరు.. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ విషయాలు చేరవేశారని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ సమాచారంతో టీడీపీ ముఖ్య నేతలు పరిశీలన కేంద్రానికి భారీగా చేరుకున్నారు. టీడీపీ నేతల ఫిర్యాదుల ఆధారంగానే అధికారులు నామినేషన్లను తిరస్కరించడం గమనార్హం. నామినేషన్ల పరిశీలనలో టీడీపీ నేతలు అప్లికేషన్‌లో పూర్తి చేసిన సమాచారంలోని లోపాలను కాగితాల రాసుకొని వచ్చి ఆర్‌వో దృష్టికి తీసుకువచ్చారు. న్యాయవాది ద్వారా తిరస్కరణకు ఒత్తిడి తెచ్చారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు చెందిన కుటుంబసభ్యులకు చెందిన డ్వాక్రా రుణాల వివరాలు నమోదు చేయలేదని, బైక్‌పై రుణం ఉందని, పాన్‌ కార్డు నంబరు నమోదు చేయలేదని, రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని, సంతకాలు సక్రమంగా చేయలేదనే సాకులతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, డమ్మీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. ఇలా ప్రణాళిక ప్రకారమే వారిని పోటీ నుంచి తప్పించారు. ఆర్వోపై తీవ్ర ఒత్తిడి తెచ్చి మరీ ఈ రద్దు ప్రక్రియను అక్కడే ఉండి పూర్తి చేయించారు.

టీడీపీ అభ్యర్థుల ఏకగ్రీవాల కోసమే

వైఎస్సార్‌ సీపీకి తిరుగులేని పట్టు ఉన్న వేజండ్ల, శేకూరు, చేబ్రోలు తదితర సెగ్మెంట్లలోనే ఈ అక్రమాలకు పాల్పడటం గమనార్హం.

భగ్గుమన్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

ఎన్నికల నిబంధనలను గాలికొదిలి, అధికార పార్టీకి తొత్తులుగా మారిన యంత్రాంగం పనితీరుపై వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిస్తున్న ఈ అక్రమాలను ప్రజల ముందు ఎండగడతామని, న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. నామినేషన్లు తిరస్కరణకు గురైన ఎంపీటీసీ అభ్యర్థులు ఆదివారం తెనాలి సబ్‌ కలెక్టర్‌ వద్దకు అప్పీల్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ నేతలు వ్యహరించిన తీరు, వారికి అడ్డదారిలో సహకరించిన అధికారులపై ఉన్నతాధికారికి వివరిస్తామని చెప్పారు.

మండల వ్యాప్తంగా వివిధ సెగ్మెంట్లలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ వివరాలు...

వేజెండ్ల 1వ సెగ్మెంట్‌లో 2 నామినేషన్లు, వేజెండ్ల 2వ సెగ్మెంట్‌లో ఒకటి, నారాకోడూరు 1, 2 సెగ్మెంట్లలో మొత్తం నామినేషన్లు, శేకూరు 1వ సెగ్మెంట్‌లో 2, గొడవర్రులో ఒకటి, చేబ్రోలు 1, 3, 4, 6 సెగ్మెంట్లలో ఒక్కో సెగ్మెంట్‌లో ఒక్కొక్క నామినేషన్‌, మంచాలలో ఒకటి, వడ్లమూడి 1, 2, 3 సెగ్మెంట్లలో ఒక్కో సెగ్మెంట్‌లో ఒక్కొక్కటి చొప్పున, సుద్దపల్లి 1లో ఒక నామినేషన్‌ తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement