కాజ టోల్‌గేట్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

కాజ టోల్‌గేట్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

కాజ టోల్‌గేట్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు అమరావతిని సందర్శించిన సింగపూర్‌ పాత్రికేయ బృందం కొనసాగుతున్న అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన ఎస్‌ఐ ప్రియాంకపై చర్యలు

మంగళగిరి రూరల్‌: ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు రవాణాను అరికట్టడంతోపాటు ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళగిరి పరిధిలోని కాజ టోల్‌గేట్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ (ఎస్‌ఎస్‌టీ) అధికారులు ఈ చెక్‌పోస్టు వద్ద నిరంతరం నిఘా ఉంచుతూ, రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. శనివారం కాజ టోల్‌గేట్‌ మీదుగా వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల్లో అక్రమంగా మద్యం, నగదు లేదా ఎన్నికల నియమావళికి విరుద్ధమైన ఇతర వస్తువులను తరలిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. ఎస్‌ఎస్‌టీ బృందంలో గుంటూరు హౌసింగ్‌ కార్పొరేషన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సురేష్‌బాబు, మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ శామ్యూల్‌ రాజ్‌, వీఆర్వో కొండలరావు తదితరులు ఉన్నారు.

అమరావతి: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతిలోని అపురూపమైన బౌద్ధ వారసత్వ సంపదను సింగపూర్‌ పాత్రికేయ బృందం శనివారం సందర్శించింది. స్థానిక పురావస్తు మ్యూజియం, అమరావతి మహాస్తూపం, ధ్యానబుద్ధ విగ్రహాన్ని బృందం తిలకించింది. సింగపూర్‌ పాత్రికేయ బృంద సభ్యులు భవన్‌ జైప్రగాస్‌, డారిల్‌ లిమ్‌, కీర్తిగా రవీందరన్‌, మహమ్మద్‌ ఇజ్వాండి బిన్‌ అజ్మాన్‌, శివరంజని గుణశేఖరన్‌లకు పురావస్తు, పర్యాటక శాఖల అధికారులు స్వాగతం పలికారు. స్థానిక అధికారులు అమరావతి బౌద్ధ వారసత్వ ప్రాముఖ్యతను, బౌద్ధధర్మం మానవ జీవనవిధానంపై చూపిన ప్రభావాన్ని, అమరావతికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విశిష్టతను బృంద సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక ప్రాధికార సంస్థ ఆర్‌డీ ఈడి ప్రసన్నలక్ష్మి, జిల్లా పర్యాటక శాఖాధికారి నాయుడమ్మ, పురావస్తు శాఖాధికారి నాగేంద్రకుమార్‌ పర్యాటక శాఖ యూనిట్‌ మేనేజర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

నగరంపాలెం: గుంటూరు నగరంలోని సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో శనివారం అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది. తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలకు సంబంధించి అగ్రిగోల్డ్‌ బాండ్లను పరిశీలించారు. సుమారు వెయ్యి దరఖాస్తులు, 1,700 బాండ్లను పరిశీలన చేశారు. ఈనెల 26, 27 తేదీల్లోనూ పైన తెలిపిన మండలాలకు సంబంధించిన బాండ్లను పరిశీలించనున్నట్లు సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఏఎస్పీ బి.సీతారామయ్య తెలిపారు. ఈనెల 28 నుంచి 31 వరకు తాడేపల్లి, దుగ్గిరాలకు సంబంధించి అగ్రిగోల్డ్‌ బాండ్లను పరిశీలిస్తామని చెప్పారు. తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని అగ్రిగోల్డ్‌ బాండ్ల డిపాజిట్‌దారులు గుంటూరు మెడికల్‌ కళాశాల సమీపంలోని సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో హాజరవ్వాలని తెలిపారు.

చిలకలూరిపేట: మాజీ మంత్రి విడదల రజినిపై దౌర్జన్యానికి పాల్పడిన చిలకలూరిపేట రూరల్‌ ఎస్‌ఐ కె . లేఖా ప్రియాంకపై ఎస్‌ఈసీ శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. శుక్రవారం జరిగిన సంఘటన గురించి మీడియా ద్వారా తెలుసుకున్న ఎన్నికల సంఘం సంబంధిత ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐను ఎన్నికల విధులతోపాటు అన్ని విధుల నుంచి కూడా ఎస్పీ తప్పించారు. ఆమెను వీఆర్‌కు పంపినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement