తల్లీకూతుళ్ల సొంతం | - | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్ల సొంతం

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

తల్లీకూతుళ్ల సొంతం

విలక్షణ రచనలు అత్తలూరి విజయలక్ష్మికే ప్రత్యేకం సాంస్కృతిక కళాసేవలో రాజేశ్వరి ఉదయగిరి ప్రతిభ

బహుముఖ ప్రజ ్ఞ...

తెనాలి: కథలు, నవలలు, నాటికలు, రేడియో నాటకాలు, టీవీ సీరియల్స్‌, టెలీ ఫిలిమ్స్‌, జీవిత చరిత్రలు... ఒకటేమిటి... వివిధ రచనా ప్రక్రియల్లో ఆ కలం ఆరితేరింది. రంగస్థల నాటికలే కాదు... మీడియా విద్యార్థుల కోసం లఘునాటికలు రాశారు. కవితలు, పత్రికల్లో కాలమ్స్‌ రాశారు. డాక్యుమెంటరీలకు వాయిస్‌ ఇచ్చారు. ఆకాశవాణిలో ‘ఏ’ గ్రేడ్‌ ఆర్టిస్టుగా రాణించారు. ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. వీరి రచనలు పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. ‘సరసిజ’ సాహిత్య సంస్థను కూడా నడిపారు. ఆమె రాసిన ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ నాటిక ఆధారంగా ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘కితకితలు’ సినిమా కూడా సూపర్‌హిట్టే. ఆమే అత్తలూరి విజయలక్ష్మి. ప్రముఖ తెలుగు రచయిత్రి. అనేక కథలు, నవలలు, నాటకాలు రాశారు. తెనాలిలో 1956 జూన్‌లో జన్మించారు. ప్రముఖ రచయిత, జర్నలిస్టు ఏఎల్‌ నరసింహారావు, అనసూయ ఆమె తల్లిదండ్రులు. వృత్తిరీత్యా కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లడంతో అక్కడే విద్యాభ్యాసం సాగింది. పబ్లిక్‌ రిలేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి, అక్కడి మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డులో చేరారు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పదవీ విరమణ పొందారు. ఇంట్లోని రకరకాల పుస్తకాలతో తొలి నుంచీ అనుబంధం ఉండేది. పద్దెనిమిదేళ్లకే తన మనసులోని భావాలను కాగితంపై పెట్టసాగారు. 1975 నుంచి రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. అదే ఏడాది ఆమె రాసిన మొదటి కథ ‘వర్ధమాన రచయిత్రి’ ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం నుంచి ప్రసారమైంది. తొలి నాటిక ‘అభ్యుదయం ఎక్కడ’ కూడా రేడియోలోనే ప్రసారమైంది. అచ్చులో చూసుకున్న తొలి కథ ‘కలలు కన్న రాధ’.. మయూరి వారపత్రికలో ప్రచురితమైంది. కొన్ని కథలు, స్కెచ్‌లు, నాటికలు రాశారు. పెళ్లితో కొంత విరామం వచ్చింది.

రచనల పరంపర

1986 నుంచి రచనా వ్యాసంగంలో వీరి కలం కదం తొక్కింది. రంగస్థల నాటికలు, నాటకాలు, రేడియో నాటకాలు, కవితలు, కథలు, నవలలు, వ్యాసాలు, కాలమ్స్‌, టీవీ సీరియల్స్‌, టీవీ ఫిలిమ్స్‌ రాస్తూ వచ్చారు. వీరి కథలు ఐదు సంపుటాలుగా వెలువడ్డాయి. నాటకాలు మరో నాలుగు సంపుటాలుగా వచ్చాయి. మరో 17 నవలలు రాశారు. రేడియో కోసం ‘కళ్యాణి పెళ్లి’, ‘ఏటీఎం అల్లుడు’, ‘కొక్కొరోకో’, ‘ఊరు రమ్మంది’ వంటి 20 నాటికలను రచించారు. మీడియా విద్యార్థుల కోసం మరెన్నో నాటికలు, లఘునాటికలు రాయడంతోపాటు వాటిని ప్రదర్శించారు. పలు టీవీ నాటకాలు, టెలీ ఫిలిమ్స్‌, టీవీ సీరియల్స్‌ రచించారు. 2013లో ‘సరసిజ... ఏ థియేటర్‌ ఫర్‌ ఉమెన్‌’ అనే సంస్థను ప్రారంభించి, మహిళలతో నాటకాలు వేయించడం గొప్ప అనుభూతినిచ్చిందని విజయలక్ష్మి చెబుతారు.

సినిమాగా ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ నాటిక...

‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ నాటిక అనేక పరిషత్తుల్లో ఉత్తమ ప్రదర్శనతోపాటు ఎన్నో బహుమతులను అందుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ముంబయి, చైన్నె వంటి నగరాల్లోనూ ప్రదర్శితమైంది. 2003లో ‘తానా’ సభల్లో సినీ కళాకారులచే ప్రదర్శించారు. ఇదే నాటిక ఆధారంగా సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ‘కితకితలు’ సినిమాను తెరకెక్కించారు. దూరదర్శన్‌లో డాక్టర్లు, రంగస్థల కళాకారులతో ఇంటర్వ్యూలు చేశారు. 1985 నుంచి 1990 వరకు ఎన్నో డాక్యుమెంటరీలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఎన్నో రచనలు చేసిన విజయలక్ష్మికి పలు గౌరవాలు దక్కాయి. వీటిలో ఆకాశవాణి జాతీయ అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ఉన్నాయి.

తల్లి బాటలో తనయ...

విజయలక్ష్మి కుమార్తె రాజేశ్వరి ఉదయగిరి. ఆమె సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నాట్యం, సంగీతం, నటనలో కూడా శిక్షణ పొందారు. తల్లి విజయలక్ష్మి రాసిన నాటకంతోనే రేడియోలోకి ప్రవేశించారు. ఆమె కూడా ‘ఏ’ గ్రేడ్‌ ఆర్టిస్టు. టీవీలో ‘బిజినెస్‌ ట్రాక్స్‌’, ‘యువర్స్‌ లవింగ్‌లీ’ కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేశారు. ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా రాణించారు. ‘ప్రియురాలు పిలిచె’, ‘శాంతి నివాసం’, ‘ఎడారి కోయిల’ టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ‘ఇడియట్‌’, ‘శివమణి’, ‘ఏ ఫిల్మ్‌ బై అరవింద్‌’ సినిమాల్లో హీరోయిన్‌కు డబ్బింగ్‌ చెప్పారు.

అమెరికాలో తెలుగు రేడియోతో ఎంట్రీ...

ఎంసీఏ పూర్తి చేశాక వెబ్‌స్మార్ట్‌లో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని, పాపకు తల్లి అయ్యారు. సింగపూర్‌లో ఉద్యోగం చేసిన అనంతరం అమెరికాకు వెళ్లారు. డల్లాస్‌లో నివసిస్తూ రేడియో, టీవీ షోలు, సినిమా డబ్బింగ్‌లతో గడిపారు. తల్లి విజయలక్ష్మి సూచనతో 2006లో డల్లాస్‌లో తెలుగు రేడియో కార్యక్రమాలతో మళ్లీ తనలోని కళాకారిణికి ఊపిరి పోశారు. వారాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ‘ఆటా’, ‘తానా’ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సొంతంగా ‘రేడియో సురభి’ అనే ఎఫ్‌ఎం రేడియోను ప్రారంభించి, రోజుకు 24 గంటల పాటు కార్యక్రమాలను ప్రసారం చేశారు. వారానికి 50 వేల మంది శ్రోతలతో ఈ రేడియో నడిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement