పెదకాకాని: చిన్న చిన్న కారణాలతో పెదకాకానిలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌లు తిరస్కరించడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పెదకాకాని మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు 138 మంది నామినేషన్‌లు వేశారు. శనివారం నామినేషన్‌లు పరిశీలించారు. చిన్న కారణాలతో కేవలం వైఎస్సార్ సీపీకి చెందిన వారి 22 నామినేషన్‌లు తిరస్కరించారు. ప్రక్రియ ప్రారంభం నుంచి టీడీపీ నాయకులు కొందరు ఎంపీడీఓ కార్యాలయంలోని ఏసీ రూం అడ్డాగా చేసుకుని పథక రచన చేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థితో ఇద్దరిని మాత్రమే పరిశీలనకు అనుమతించారు. స్వల్ప కారణాలు చూపిస్తూ 9 సెగ్మెంట్‌లలో వైఎస్సార్ సీపీకి చెందిన 22 మంది నామినేషన్‌లు తిరస్కరించడంతో వారు ఆందోళనకు దిగారు. పలు చోట్ల డమ్మీ అభ్యర్థుల నామినేషన్‌లు అంగీకరించడంతో అగతవరప్పాడు, తక్కెళ్ళపాడు, పెదకాకానిలో 3 స్థానాలు కలిపి మొత్తం ఐదు ఎంపీటీసీ సెగ్మెంట్‌లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీలో లేకుండా పోయారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. హిమశైలజ మాట్లాడుతూ నిబంధలన ప్రకారం ఇరు పార్టీల అభ్యర్థుల సమక్షంలో నామినేషన్‌లు పరిశీలించామన్నారు. తప్పులు ఉన్న నామినేషన్ పత్రాలను తిరస్కరించామని, ప్రొసీడింగ్స్ ఆయా అభ్యర్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఆ అభ్యర్ధులు వారి అభ్యంతరాలను ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం అప్పీలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ డైరెక్టర్, మాజీ డీజీ, ఐపీఎస్ పి.వి కృష్ణారెడ్డి శనివారం సాయంత్రం దర్శించుకున్నారు.


